తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకురాసి ఇంటికెళ్లిపోతానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల (YS SHARMILA) అన్నారు. అదే.. సమస్యలు ఉన్నాయని తాము నిరూపిస్తే ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తారా? అని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల నుంచి మొదలైన షర్మిల పాదయాత్రను (praja prasthanam yatra).. వైఎస్ విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యమని షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుటుంబ సంక్షేమం తప్ప.. ప్రజల సంక్షేమం పట్టదని ఆమె విమర్శించారు. ప్రజల సంక్షేమం పట్టని కేసీఆర్‌ను.. గద్దె దించడమే లక్ష్యమని షర్మిల అన్నారు.
ఒక్కరోజు దీక్షచేస్తామంటేనే చిన్నదొర కేటీఆర్ గారికి జీర్ణం కాలేదు. వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరి, ఇప్పుడు పాదయాత్రలో ప్రతి రోజూ మేము ప్రజల మధ్యనే ఉంటాము. ఇప్పుడేమంటారో అనండి చిన్నదొరా.. అని అడుగుతున్నాను. ఆడదాన్ని అయ్యుండి ప్రజల పక్షాన.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు నేను పాదయాత్ర చేస్తున్నాను. మరి మీరు అధికారంలో ఉండి ప్రజల పక్షాన.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏం చేస్తున్నారు..? దమ్ముంటే నాతోపాటు పాదయాత్రకు రండి.. సమస్యలు లేవు అని మీరు అంటున్నారు కదా.. కేసీఆర్ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా.. రండి.. నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పి నేను ఇంటికి వెళ్లిపోతా. ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను చూపిస్తా.. ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపెట్టండి. ఒకవేళ సమస్యలు ఉంటే మీరు క్షమాపణలు చెప్పి రాజీనామాలు చేసి, ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి. దమ్ముంటే ఈ సవాలును స్వీకరించండి.
- వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
ఆయన అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడని షర్మిల విమర్శించారు. రేవంత్ రెడ్డిలా తమకు బ్లాక్ మెయిల్ చేయడం రాదని.. ప్రజాప్రతినిధుల కొనుగోలు, అమ్మకాలు మాకు చేతకాదన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని.. అడ్డంగా దొరికిన దొంగకు విశ్వసనీయత ఉందా? అని షర్మిల ప్రశ్నించారు.
అరువుతెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గారు మా పార్టీ ఓ ఎన్జీవో అన్నారంట. నిజమే ఎన్జీవో అంటే లాభార్జన లేకుండా సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సంస్థ. మేము సమాజం కోసం లాభం చూసుకోకుండా పనిచేసేవాళ్లం. రేవంత్ రెడ్డిగారిలాగా బ్లాక్మెయిలింగ్, కరప్షన్ మాకు చేతకాదు.
- వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
ఆధారాలుంటే బయటపెట్టండి..
కేసీఆర్ (cm kcr) అవినీతిపై ఆధారాలున్నాయని భాజపా అంటోందని.. వాటిని ఎందుకు బయట పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ నాలుకకు నరం లేదని.. కేసీఆర్ గాడిదను కూడా ఆవు అని నమ్మించగలరని ఎద్దేవా చేశారు.
ఇదీచదవండి.