ETV Bharat / city

YSRCP Plenary: కోలాహలంగా వైకాపా ప్లీనరీ.. ఉత్సాహంలో కార్యకర్తలు - మొదటిరోజు కోలాహలంగా సాగిన వైకాపా ప్లీనరీ

YSRCP Plenary: గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వైకాపా ప్లీనరీలో.. శుక్రవారం తొలిరోజు కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులు, ఇతర వాహనాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివచ్చారు. వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు వేయడంతో శుక్రవారం వర్షం కురిసినా.. కార్యక్రమం సజావుగానే సాగింది. ప్లీనరీకి ప్రభుత్వం వేలమంది పోలీసుల్ని మోహరించింది.

YSRCP Plenary held greatfully on first day at guntur
కోలాహలంగా వైకాపా ప్లీనరీ
author img

By

Published : Jul 9, 2022, 9:41 AM IST

Updated : Jul 9, 2022, 10:14 AM IST

YSRCP Plenary: వైకాపా ప్లీనరీలో శుక్రవారం తొలిరోజు కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులు, ఇతర వాహనాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివచ్చారు. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో జరుగుతున్న ప్లీనరీకి పార్టీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు వేయడంతో శుక్రవారం వర్షం కురిసినా.. కార్యక్రమం సజావుగానే సాగింది.

ప్లీనరీకి ప్రభుత్వం కొన్ని వేలమంది పోలీసుల్ని మోహరించింది. భోజనాల నుంచి.. అడుగడుగునా పోలీసుల పర్యవేక్షణ కనిపించింది. వైకాపా వాలంటీర్ల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం, పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు వై.ఎస్‌.విజయమ్మ ప్రకటించడం తొలి రోజు ప్రత్యేకతలు. మహిళా సాధికారత- దిశ చట్టం, విద్య, నవరత్నాలు- నగదు బదిలీ, వైద్యం అన్న నాలుగు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు.

ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరిగింది. దానికి ముందు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకునేలా పార్టీ నియమావళిని సవరిస్తూ శనివారం రెండోరోజు ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

స్తంభించిన నాగార్జున యూనివర్సిటీ.. వైకాపా ప్లీనరీతో శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కార్యకలాపాలు స్తంభించాయి. మంత్రులు, ముఖ్యుల వాహనాలకు యూనివర్సిటీలో పార్కింగ్‌ కల్పించారు. యూనివర్సిటీ ప్రధాన గేటు మూసేశారు. ఆ గేటులోంచి యూనివర్సిటీ సిబ్బంది వాహనాలనూ వెళ్లనివ్వకపోవడంతో ఇబ్బంది పడ్డారు. యూనివర్సిటీలో శుక్రవారం జరగాల్సిన పలు సెమినార్లు, పరీక్షలు, బీఈడీ పరీక్ష పత్రాల మూల్యాంకనం వంటి కార్యక్రమాలను వాయిదా వేశారు.

పెన్నులనూ అనుమతించలేదు.. వైకాపా ప్లీనరీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. జాతీయరహదారి మొదలు.. ప్రాంగణంలో ప్రతిచోటా పోలీసు జాగిలాలతో తనిఖీలు చేశారు. సమావేశ ప్రాంగణంలోకి వెళ్లేవారి దగ్గర బ్యాగులు ఉంటే క్షుణ్నంగా తనిఖీ చేశారు. చివరికి పెన్నులనూ లోపలికి తీసుకెళ్లనివ్వలేదు. గేటు దగ్గరే తీసేసుకున్నారు.

మొబైల్‌ ఫోన్లు తప్ప.. సిగరెట్లు, అగ్గిపెట్టెలు, వాటర్‌ బాటిళ్లు ఏవీ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. పోలీసులు దాదాపుగా వైకాపా వాలంటీర్లలా పనిచేశారు. భోజనాల దగ్గర రద్దీని నియంత్రించే క్రమంలో ఐస్‌క్రీములనూ పోలీసులే పంచారు. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.

ప్లీనరీకి స్పీకర్‌ హాజరు.. వైకాపా ప్లీనరీకి శాసన సభాపతి తమ్మినేని సీతారాం హాజరవడం చర్చనీయాంశమైంది. కార్యక్రమం ఆరంభం నుంచీ వేదికపైనే ఉన్న ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో ఉల్లాసంగా ముచ్చటిస్తూ కనిపించారు. సాధారణంగా స్పీకర్‌ హోదాలో ఉన్న వ్యక్తి పార్టీ కార్యక్రమాలకు హాజరుకారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 9, 2022, 10:14 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.