వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ పర్యటన గోప్యంగా సాగింది. తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి ఉదయం 10 గంటల సమయంలో బయల్దేరారు. ఆమె ప్రయాణించిన కారుతోపాటు, ఒక ఎస్కార్ట్ వాహనం మాత్రమే ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా రాష్ట్ర సచివాలయం వద్దకు చేరుకున్నారు. సచివాలయం ప్రాంగణంలోకి వెళ్లలేదు. సచివాలయం ప్రహరీ గోడకు, పార్కింగ్ ప్రదేశానికి మధ్య ఉన్న రహదారి మీదుగా.. కారులోంచే సచివాలయం, అసెంబ్లీ భవనాన్నీ చూసుకుంటూ ముందుకెళ్లారు.
తర్వాత ఆమె పర్యటన ప్రభుత్వ పరిపాలన నగరంలో నుంచి సాగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మించిన భవనాల్ని చూస్తూ హైకోర్టు వరకు వెళ్లారు. మధ్యలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి పునాదులు వేసిన ప్రాంతాన్ని, ఇతర నిర్మాణాల్ని చూశారు. ఆమె ఎక్కడా కారులోంచి దిగలేదని, లోపలి నుంచే పరిశీలించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హైకోర్టు వరకు వెళ్లి వెనక్కు తిరిగి ఉండవల్లిలోని నివాసానికి వెళ్లినట్టు తెలిసింది. ఈ పర్యటన గురించి సీఆర్‌డీఏ అధికారులకూ సమాచారం లేదు.
ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం