‘సభలో మాట్లాడిన వారి ప్రేమాభిమానాలు చూస్తుంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడ(తెలంగాణలో) నడయాడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. నేను, నా పిల్లలం ధన్యులం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సహకారంతో నా కుమారుడు జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజన్నపాలన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోనూ రాజన్న రాజ్యం కోసం నా బిడ్డ షర్మిలకు మీ దీవెనలు ఇవ్వాలి’
- వైఎస్ విజయమ్మ
‘తెలంగాణలో మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తీసుకురావడమే నా లక్ష్యం. అదే ఆయనకు నివాళి. తెలంగాణలో సాగుతున్న నియంత రాజ్యం పోవాలి. నాన్న నాతోనే ఉండి మీ దగ్గరకు నడిపిస్తున్నారు. నాన్న నా గుండెలపై ఒక విల్లు రాశారు. తెలంగాణ ప్రజల కోసం నేను నిలబడతా, కొట్లాడతా.. ఆయన ప్రేమించిన ప్రాంతం కష్టాల్లో ఉంటే..రాష్ట్రం (తెలంగాణ) అప్పుల్లో ఉంటే వైఎస్ బిడ్డగా చూస్తూ ఊరుకోలేకపోతున్నా’.
- వైఎస్ షర్మిల
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా విజయమ్మ ఆధ్వరంలో గురువారం హైదరాబాద్‌లోని నొవాటెల్‌లో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రం నుంచి కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు వచ్చారు. తెలంగాణలో తెరాస, మజ్లిస్, వామపక్షాల నాయకులు దూరంగా ఉన్నారు. సంస్మరణ సభకు హాజరైన వారి వద్దకు విజయమ్మ, షర్మిల వెళ్లి పేరుపేరున పలకరించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్ భౌతికంగా దూరమైనా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఆయన మాటలు, చేసిన పనులు ఈరోజుకీ పథకాల రూపంలో కనిపిస్తుంటాయన్నారు. ‘‘ఇది రాజకీయ సభ కాదు. వైఎస్‌ను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఏ మూలకు వెళ్లినా ఆయన పేరు వినిపిస్తుంటుంది. ఆ ఒక్కడూ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు... ఇలా ఉండేది కాదనే మాట వినిపిస్తోంది’’ అంటూ విజయమ్మ వైఎస్ గురించి గుర్తు చేసుకున్నారు. ‘‘ఏపీలో ఎవరిని అడిగినా నీ పేరే చెప్పేవారని రాజీవ్‌గాంధీ వైఎస్‌తో అనేవారు. మన్మోహన్‌సింగ్ వద్దకు వెళ్లినప్పుడు వైఎస్‌ఆర్ వల్లే మేం ఈ పొజిషన్‌లో ఉన్నామని అన్నారు. ప్రస్తుత ప్రధాని.. నరేంద్రమోదీ వద్దకు వెళ్లినప్పుడు...ఇతర పార్టీల నేతలు చనిపోతే ఎప్పుడు మాపార్టీ జెండాదింపి సంతాపం తెలపలేదు. వైఎస్ ఒక్కరికే జెండా దింపి సంతాపం తెలిపాం అని చెప్పారు..’అంటూ వివరించారు. ఏపీలోని వైకాపా నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరు కాలేదు. తెలంగాణ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. వైఎస్ కుటుంబమూ, నేనూ వేర్వేరు కాదని కేవీపీ రామచంద్రరావు అన్నారు.
ఇదీచూడండి:
GOLD SMUGGLING: అవాక్కైన అధికారులు.. ఇలా కూడా బంగారం తరలించొచ్చా..!