నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ.. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద వైఎస్ షర్మిల చేపట్టిన 'ఉద్యోగదీక్ష'... ఉద్రిక్త పరిణామాల మధ్య కొనసాగుతోంది. గురువారం ఉదయం దీక్ష ప్రారంభించిన షర్మిల... తన తండ్రి వైఎస్‌కు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన అమరులకు సంతాపం తెలిపారు. సామాజిక వేత్త కంచె ఐలయ్య, బీసీ నేత ఆర్.కృష్ణయ్య షర్మిలకు సంఘీభావం తెలిపారు. షర్మిలను... ఆమె తల్లి విజయమ్మ వేదికపై ఆశీర్వదించి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటలకు గడువు ముగిసిందని.... దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. లోటస్‌పాండ్‌లోనైనా దీక్ష కొనసాగిస్తానంటూ షర్మిల కాలినడకన తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా బయలుదేరారు. దీంతో పాదయాత్రకు అనుమతి లేదంటూ... పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో షర్మిల అనచరులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో పెద్దసంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో షర్మిల దుస్తులు స్వల్పంగా చిరిగాయి. చేతికి గాయమవటంతోపాటు కాసేపు సొమ్మసిల్లారు.
72 గంటల పాటు నిరాహార దీక్ష
షర్మిలను పోలీసులు తమ వాహనంలోనే లోటస్‌పాండ్ వద్దకు చేర్చారు. అయినప్పటికీ తాను దీక్షను కొనసాగిస్తానంటూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని.... 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తేల్చిచెప్పారు. తనపై చేయి వేస్తే ఊరుకునేది లేదని పోలీసులను హెచ్చరించారు. ఏదో ఒకరోజు తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని వైఎస్ షర్మిల ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ కుటుంబంలో
జులై 8న తాను పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని.... పాదయాత్ర వివరాలను అదేరోజున వెల్లడిస్తానని షర్మిల తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత, విద్యార్థులు ముందుండి పోరాడారని... నేడు వారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం తాను పోరాడతానని... ఎవరూ నిరాశకు గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.
ఆ తీరు సరికాదు
లోటస్‌పాండ్ దీక్షా శిబిరం వద్ద షర్మిలను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పరామర్శించారు. శాంతియుతంగా దీక్ష చేసి... తిరిగి వస్తున్న షర్మిలపై.. పోలీసుల వ్యవహరించిన తీరు సరికాదని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆడ పోలీసులతోపాటు మగవాళ్లు కూడా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని ఇందిరా శోభన్ ఆరోపించారు. షర్మిలపై దాడికి పాల్పడటాన్ని పోలీసుల సంస్కారానికే వదిలేస్తున్నామని షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ తెలిపారు.
ఇదీ చూడండి : కొవిడ్‌తోనే రక్తం గడ్డకట్టే ముప్పు అధికం!