ప్రభుత్వశాఖల్లోని పొరుగుసేవల ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చేందుకు వీలుగా కార్పొరేషన్ ఏర్పాటుచేసేందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. లాభాపేక్ష లేకుండా సాధారణ పరిపాలనాశాఖ పర్యవేక్షణలో కార్పొరేషన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పొరుగుసేవల ఉద్యోగాల్లో దళారీ వ్యవస్థ నిర్మూలనకు... ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వశాఖల్లోని పనికి ఒకటే జీతం ఇచ్చేలా... ఆన్‌లైన్ పద్ధతుల్లో జీతాల చెల్లింపు చేసే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే
పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టి ప్రభుత్వ శాఖలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నాటికి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 16న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకారం తెలపనున్నారు. పొరుగుసేవల ఉద్యోగాల్లో మొత్తంగా 50శాతం మహిళలకు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఎన్నికల హామీ అమలు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షకుపైగా పొరుగుసేవల ఉద్యోగాల నియామకాలు ఇప్పటివరకూ ఏజెన్సీల ద్వారా జరిగేవి. ఈ ప్రక్రియ వల్ల అందరికీ అవకాశాలు దక్కకపోవటం.. పనికి తగ్గ జీతం పూర్తిస్థాయిలో లభించకపోవటం.. సకాలంలో జీతం అందకపోవటం వంటి సమస్యలను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొనేవారు. వీటన్నింటికి పరిష్కారంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు.
ఇన్‌ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో
సాధారణ పరిపాలనాశాఖ ఆధ్వర్యంలో పనిచేయబోయే ఈ కార్పొరేషన్‌కు అనుబంధంగా... జిల్లాల స్థాయిలో ఇన్‌ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో విభాగాలు ఏర్పాటుచేస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.
ఇదీ చదవండి : ఒప్పంద, పొరుగు సేవల నియామకాలపై కమిటీ