MP VIJAYASAIREDDY: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి డిమాండు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారమిక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ప్రత్యేక హోదా గురించి అడిగాం. నాటి ప్రధాని ఇచ్చిన ఈ హామీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ఇప్పటి భాజపా ప్రభుత్వం అమలు చేయకుండా రాష్ట్రం పట్ల సవతి ప్రేమ ప్రదర్శిస్తోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులనూ తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. కేంద్రమే ఈ ప్రాజెక్టు జాప్యానికి కారణమవుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు, కడప సమీకృత ఉక్కు కర్మాగారానికి అనుమతులివ్వడంలోనూ జాప్యమే. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి కళాశాలల్లో అవకాశం కల్పించాలి. మహిళా సాధికారత కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలి’ అని కోరామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలు వరద ముంపునకు గురైనందున పార్లమెంటులో చర్చించాలని, కేంద్రం పరిహారం చెల్లించాలని కోరామని తెలిపారు. జీఎస్‌టీ పరిహారాన్ని మరో 5 ఏళ్లు పెంచాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ఇవీ చదవండి: