రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చి విస్మరించిన భాజపా, జనసేన, తెదేపాలకు తిరుపతి ఎన్నికలో ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో తిరుపతి సభా వేదికగా ప్రధాని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. హోదాపై చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
రాష్ట్రంలో రాజకీయాలు చాలా దుర్మార్గ విధానంలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అవాకులు చవాకులు పేలుతున్న చంద్రబాబు సహా భాజపా నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. ఉపఎన్నికలో వైకాపా ఘన విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ ఎంత, రెండో స్థానంలో ఎవరుంటారు అనే అంశాలే తేలాల్సి ఉందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ అందరికీ మంచి చేస్తున్నందునే స్వామీజీలు సీఎంను పొగుడుతున్నారని.. ఈ విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. వివేకా హత్యపై భాజపానే ప్రశ్నించాలని.. హోంశాఖ నేతృత్వంలోని సీబీఐ విచారణ జరుగుతోందన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని నారా లోకేశ్‌కు.. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
ఇదీ చదవండి