రాష్ట్రంలో ఆర్టికల్ 360 కింద ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. గత 8 నెలల్లో రాష్ట్ర ప్రగతి మందగించిందన్నారు. ఆదాయం పడిపోవడమే కాక... రెవెన్యూ వ్యయం పెరిగిందని ధ్వజమెత్తారు. మూలధన వ్యయం రూ.10 వేల 486 కోట్లు తగ్గిందని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఇవ్వడమే కష్టమైందన్నారు. సంక్షేమంపై వ్యయం రూ.2 వేల కోట్లు తగ్గించేశారని... పేదల పథకాలకు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వ పథకాలను రద్దు చేసి, కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. పాలన చేతగాక రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు.
ముఖ్యమంత్రికి ఏమీ పట్టడం లేదు
రాష్ట్రం సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా... సీఎం జగన్ చిద్విలాసంగా ఉన్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.35 వేల 260 కోట్లు ఉంటే... 8 నెలల్లోనే 35 వేల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది అప్పుల అంచనా 68 వేల కోట్లు ఉంటే... వైకాపా నిర్వాకాలతో ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దే సామర్ధ్యం ప్రభుత్వానికి లేదని ఆక్షేపించారు.
ఇవీ చదవండి: