పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపటాన్ని తెదేపా ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పుబట్టారు. వైకాపా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే 2014 పునర్విభజన చట్టం సవరణ తప్పనిసరని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. విభజన చట్టంలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే ఉంది కానీ రాజధానులు ఏర్పాటు చేసుకోమని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందు విభజన చట్టంలోని అంశాలను పరిగణంలోకి తీసుకోవాలని యనమల సూచించారు.
రాజధానిపై ప్రజాభిప్రాయం తీసుకోవటానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని యనమల నిలదీశారు. రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమన్నారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ నివేదికలను పరిగణంలోకి తీసుకొని అమరావతిని రాజధానిగా నిర్ణయించారని యనమల గుర్తుచేశారు.
ఇదీ చదవండి: కరోనా తీవ్రతకు, బ్లడ్ గ్రూప్స్నకు సంబంధం ఉందా?