ఓటర్లను ప్రభావితం చేయడం, అధికారులను బెదిరించడం.. ఎన్నికల కోడ్, రాజ్యాంగ, సుప్రీంకోర్టు ఉల్లంఘనే అని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. పంచాయతీలతో సంబంధం ఉండే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏవిధంగా పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారని నిలదీశారు. పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రతిరోజూ ఎస్ఈసీపై, అధికారులపై ఏవిధంగా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. మంత్రులు కూడా పబ్లిక్ సర్వెంట్లు మాత్రమేనని... ఒకవైపు నామినేషన్లు వేస్తుంటే, మరోవైపు బెదిరిస్తూ ప్రకటనలు ఎలా చేస్తారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు ఇంతకన్నా పరాకాష్ట ఏముందని దుయ్యబట్టారు.
మంత్రుల వ్యవహారశైలిపై ఈసీ జోక్యానికి వారే అవకాశం కల్పించారని చెప్పారు. ఎవరు కోడ్ ఉల్లంఘించినా, మంత్రైనా, మామూలు కార్యకర్తైనా చర్య తీసుకునే అధికారం ఈసీదేనని స్పష్టం చేశారు. ఈసీ పరిధిలో ఉన్న అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఎలా బెదిరిస్తారని నిలదీశారు. బలవంతపు ఏకగ్రీవాలను మంత్రులు ఎలా ప్రోత్సహిస్తారని ధ్వజమెత్తారు. ఏదో విధంగా గెలవాలని, బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని ఎలా ఆదేశిస్తారని మండిపడ్డారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఈ 20నెలల్లో వచ్చిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు. గ్రామాలకు వచ్చిన నిధులు ఎవరు స్వాహా చేశారని ప్రశ్నించారు. వైకాపా మద్దతుదారులే గెలిస్తే భవిష్యత్తులో వచ్చే నిధులన్నీ వాళ్లే స్వాహా చేస్తారని ఆరోపించారు.
ఇదీ చూడండి. ఎంత మంచోడినో.. అంత దుర్మార్గుడిని!