పురపాలక, నగర పాలక ఎన్నికల్లో భక్షక వైకాపా నుంచి ప్రజల రక్షణ కోసమే... తెదేపా మేనిఫెస్టో రూపొందించిందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ రెడ్డి, జే-గ్యాంగ్ భూదందాలను అరికట్టడంతో పాటు... పట్టణ, నగర ప్రాంతాల్లో రౌడీయిజం, అకృత్యాలను అంతమొందించేందుకు తమ పార్టీ మేనిఫెస్టో కవచంలా నిలుస్తుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను ఆటంకం లేకుండా కొనసాగించుకోవటంతో పాటు... వ్యాపారులు ప్రశాంతంగా బతకాలంటే తెదేపా అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు.
జగన్ పాలనలో తాడేపల్లి ప్యాలెస్‌ను మాత్రమే సుందరీకరించుకున్నారని విమర్శించారు. సొంత ఆస్తుల విలువ పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ పట్టణాల అభివృద్ధిపై లేదన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమా రాకపోగా... ప్రజలపై భారీగా పన్ను భారం మోపటంతో పాటు ఇంధన, ఇతర నిత్యావసరాల ధరలు పెంచేశారని మండిపడ్డారు. ఇసుక, భూ, సిమెంట్ మాఫియాలు పేద, మధ్యతరగతి ప్రజల్ని పీల్చి పిప్పి చేశాయని ధ్వజమెత్తారు. మాఫియాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే తెదేపా అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
జగన్ కు మరో అవకాశం ఇస్తే జుట్టు పెంచుకోవాలన్నా, కొత్త చొక్కా వేసుకోవాలన్నా చివరికి రోడ్డుపై నడవాలన్నా కూడా పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక విధానం మళ్లీ అమలై సంక్షేమ నిధి కార్మికులకు అందాలంటే సైకిల్ గుర్తుకే పట్టణ వాసులు ఓటెయ్యాలన్నారు. కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కును ఏ1, ఏ2లు తాకట్టు పెట్టారని ఆరోపించారు. చీకటి ఒప్పందంతో విలువైన స్టీల్ ప్లాంట్ భూముల్ని కొట్టేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే విశాఖ ఉక్కుతోపాటు, ఆంధ్రప్రదేశ్‌ను కూడా అమ్మకానికి పెట్టడం ఖాయమని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.
ఇదీ చదవండి: