తెలంగాణలోని.. భాగ్యనగరంలో కుస్తీలకు ఉన్న ప్రాముఖ్యతే వేరు. కుస్తీ పోటీలకు శిక్షణ ఇచ్చే వ్యాయామశాలలు చాలానే ఉన్నాయి. కానీ గొల్కొండలోని మహమ్మదీయ తాలీమ్ అనే వ్యాయామాశాల ప్రత్యేకత సంపాదించుకుంది. ఎందుకంటే ఇక్కడ యువకులకు శిక్షణనిచ్చేది ఆరుపదులు దాటిన అజ్మేర్ ఖాన్ పహిల్వాన్. కుస్తీపై యువతకు ఆసక్తి కలిగించి... వ్యాయామశాలకు వచ్చేవారిని పహిల్వాన్‌లుగా తీర్చిదిద్దుతున్నారు. జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు పంపుతున్నారు. ఆయన శిక్షణలో పలువురు యువకులు జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటారు. త్వరలో ఎల్బీ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు హైదరాబాద్ తరపున గౌస్ అనే పహిల్వాన్ ఎంపికయ్యాడు.
కఠోర దీక్ష చేస్తేనే.. శిక్షణ
గోల్కొండలో 1960లో మద్దెఖాన్ ఉస్తాద్ స్థాపించిన మహమ్మదీయ తాలీమ్ అనే ఈ వ్యాయామశాలలో అజ్మేర్ ఖాన్ శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా ఉన్న పహిల్వాన్‌లతో కుస్తీపట్టీ విజయాలు సాధించారు. తాను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచాలనుకుని ఇదే వ్యాయామశాలలో శిక్షకుడయ్యారు. ఆసక్తి కలిగిన యువకులకు మహమ్మదీయ తాలీమ్ వ్యాయామశాలలో మద్దెఖాన్ ఉస్తాద్ వారసులు అన్ని సమకూర్చి ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందుకుగాను పహిల్వాన్ అజ్మేర్ ఖాన్‌ను శిక్షకుడిగా నియమించారు. ప్రస్తుతం 35మంది శిక్షణ తీసుకుంటున్నారు. అజ్మేర్ ఖాన్ పహిల్వాన్ వద్ద శిక్షణ పొందాలంటే కఠోర దీక్ష చేయాలి.
యువకులకు దీటుగా కుస్తీ...
మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. తెల్లవారుజాము 5 గంటలకే వ్యాయామశాలకు రావాలి. కుస్తీకి సరిపడే విధంగా వ్యాయామశాలలో మట్టిని సరిచేయడం తదితర పనులన్నీ చేయాలి. రోప్ క్లైబింగ్, పుష్‌అప్‌లు, 35 కిలోల ఇనుప రింగును మెడలో వేసుకుని గుంజీలు తీయడం వంటివి చేస్తారు. వీరితో కలిసి శిక్షకుడు అజ్మేర్ ఖాన్ పహిల్వాన్ కూడా కసరత్తులు చేస్తారు. కొన్ని సమయాల్లో యువకులకు దీటుగా కుస్తీ పడుతారు. 65 ఏళ్లు వచ్చినా నవ యువకుడిలా విన్యాసాలు చేస్తారు. అహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుని ఇష్టంతో శిక్షణ పొందితే మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చని అజ్మేర్ ఖాన్ పేర్కొన్నారు.
వ్యాయామం చేస్తే మనుషులు దేహదారుఢ్యంతో ఉంటారు. ఆరోగ్యంగా ఉండి రోగాలు కూడా రావు. నిర్వాహకులు నెలకు రూ.5వేలు ఇస్తారు. ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సాయం చేయాలి. ఫించను కూడా ఇవ్వాలి. మాకు ఇల్లు లేదు. ఒకే గదిలో ఆరుగురం ఉంటాం. - అజ్మేర్ ఖాన్ పహిల్వాన్, శిక్షకుడు
గోల్కొండలోని సాలెహనగర్‌కి చెందిన అజ్మేర్ ఖాన్ పహిల్వాన్ తండ్రి నిజాం ఆర్మీలో పని చేశారు. తండ్రి, సోదరుల ప్రోత్సాహంతో కుస్తీపై ఆసక్తి పెంచుకున్నారు. మహమ్మదీయ తాలీమ్‌లో శిక్షణ పొంది పదహారేళ్లకే కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. 25 ఏళ్లపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పహిల్వాన్‌లతో తలపడి పలు విజయాలు సాధించారు. 1985 కుస్తీ పోటీల్లో పాల్గొనకుండా శిక్షకుడిగా మారి... ఎంతో మంది యువకులను పహిల్వాన్‌లుగా తీర్చిదిద్దారు. ఈయన వద్ద శిక్షణ పొందిన పలువురు ఆర్మీ, పోలీసు ఉద్యోగాలు సంపాదించారు.
ఇదీ చూడండి: