తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలం మాచారం గ్రామానికి చెందిన యాదయ్య(41) ప్రస్తుతం షాద్‌నగర్‌లో ఉంటున్నారు. యాదయ్య తల్లి, ఆమె ముగ్గురు చెల్లెళ్లకు కలిపి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఎకరం ఎనిమిది గుంటల పొలం ఉంది. దీన్ని ఆర్నెల్ల కిందట యాదయ్య రూ.80 లక్షలకు విక్రయించారు. అందులో తమ వాటా డబ్బు ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగినా ఎవరికీ ఇవ్వలేదు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం యాదయ్య తన భార్య శైలజ(35), కుమార్తె నిహారిక(15)తో కలిసి ద్విచక్రవాహనంపై నవాబ్‌పేట మండలం కారుకొండలో బంధువుల శుభకార్యానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి షాద్‌నగర్ బయలుదేరారు. ఇది గమనించిన మహబూబ్‌నగర్‌లోని ఏనుగొండలో నివాసముంటున్న యాదయ్య చిన్నమ్మ కుమారుడు.. నర్సింహులు సరకు రవాణా వాహనంతో వెంబడించాడు. మాచారం శివారులో వెనుక నుంచి వచ్చి యాదయ్య ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ముగ్గురూ కింద పడిపోయారు.
వెంటనే తేరుకొన్న యాదయ్య లేచి కొంతదూరం పరుగులు తీశారు. కింద పడిపోయిన ఆయన భార్య శైలజ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగా.. నర్సింహులు తన వాహనాన్ని మళ్లీ వెనక్కు పోనిచ్చి రెండోసారి ఢీకొట్టాడు. తిరిగి ఆమె కింద పడిపోవడంతో వాహనాన్ని శైలజ పైకి ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. అనంతరం నిందితుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. వెంటనే స్థానికులు గాయపడిన యాదయ్య, నిహారికను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల గ్రామీణ సీఐ శివకుమార్, రాజాపూర్ ఎస్సై లెనిన్‌లు ఆసుపత్రికి వెళ్లి యాదయ్యను అడిగి సంఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. పొలం అమ్మిన డబ్బు వ్యవహారంలో తన సమీప బంధువులే వాహనంతో ఢీకొట్టి తమను హత్య చేసేందుకు యత్నించారని యాదయ్య ఫిర్యాదు చేశారు. కారుకొండ నుంచే తమను వెంబడించాడని తెలిపారు.
ఇదీ చదవండి: