Rahul Gandhi Telangana Tour : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు(మే 6న) సాయంత్రం రాహుల్ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 5:10కి ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరతారు. 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్‌కు చేరుకుంటారు. 6:05గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 'రైతు సంఘర్షణ సభ'లో పాల్గొంటారు. 8 గంటలకు వరంగల్ నుంచి రోడ్ ద్వారా రాత్రి 10:40కి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో బస చేస్తారు.
మరుసటి రోజు 7వ తేదీ మధ్యాహ్నం 12:30కి తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50- 1:10 గంటల మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. 1:15కు అక్కడి నుంచి బయలుదేరి 1:30కి గాంధీభవన్ చేరుకుంటారు. 1:45 నుంచి 2:45 వరకు అక్కడ పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. పార్టీ నేతలతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్టు సమాచారం. అనంతరం మెంబర్‌షిప్ కోఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు. ఆ తర్వాత 4 గంటలకు గాంధీభవన్ నుంచి రోడ్డు ద్వారా ఎయిర్‌పోర్టుకు వెళతారు. 5:50 కి దిల్లీ తిరుగు పయనమవుతారు.
ముఖాముఖికి హైకోర్టు నో: కాగా మే 7న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ అందుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ముఖాముఖికి అనుమతిచ్చేలా ఓయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలన్న ఎన్‌ఎస్‌యూఐ నేతల అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఓయూ ఉత్తర్వుల్లో జోక్యం చేసేందుకు నిరాకరించింది. ఓయూ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మానవతరాయ్ సహా మరో ముగ్గురు ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన హౌస్‌మోషన్‌పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఓయూ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ప్లెక్సీల కలకలం: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో.. భాగ్యనగరంలో కొన్ని ప్రాంతాల్లో వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ట్యాంక్‌బండ్, గన్పార్స్ వద్ద వెలిసిన ఈ ఫ్లెక్సీల్లో.. "రాహుల్ గాంధీ.. వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా..?" అని ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాహుల్ రెండు రోజుల పర్యటనలో నేపథ్యంలో ఓయూలో ముఖాముఖికి అనుమతి నిరాకరణ చర్చకు దారి తీయగా.. ప్రస్తుతం వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి.
గతంలో ఈ "వైట్ ఛాలెంజ్" రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో తెర మీదికి వచ్చిన ఈ వైట్ ఛాలెంజ్.. హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటనతో రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, తెరాస పార్టీల నాయకులు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. డ్రగ్స్ కేసు నుంచి పలువురు నిందితులను తప్పించేందుకు తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అదే క్రమంలో.. సదరు నాయకులు కూడా డ్రగ్స్ తీసుకున్నారంటూ.. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే.. నార్కొటిక్ టెస్ట్ చేయించుకోవాలని సవాల్ విసిరారు. ఇలా వైట్ ఛాలెంట్ చర్చనీయాంశమైంది.
మొదట మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. ధీటుగా స్పందించిన కేటీఆర్.. తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని.. అందుకోసం దిల్లీ ఎయిమ్స్‌కు వస్తానని తెలిపారు. అయితే.. ఈ ఛాలెంజ్‌లో రాహుల్ గాంధీ కూడా ఉంటేనే తాను వస్తానని మెలిక పెట్టారు. ఇలా ఈ వైట్ ఛాలెంజ్‌లోకి.. రాహుల్‌గాంధీ పేరు వచ్చింది. అది కాస్తా.. ప్రస్తుతం రాహుల్ పర్యటన నేపథ్యంలో ఏకంగా ఫ్లెక్సీల రూపంలో ప్రత్యక్షమవటం ఆసక్తికరంగా మారింది.
ఇవీ చూడండి:
- కోర్టు ధిక్కరణ కేసు.. స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- అర్ధరాత్రి యువకులు హల్చల్.. ప్రకాశం బ్యారేజ్‌పై డ్యాన్స్‌లు