గ్రామాల్లో మాస్క్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకూ జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో కరోనా కట్టడి కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. సర్పంచి అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేసి అమలు చేయాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై 50 నుంచి 200 రూపాయల వరకు జరిమానా విధించాలని సూచించింది.
ఇతర ప్రాంతాల వారు మాస్క్ పెట్టుకోకపోతే గ్రామాల్లోకి అనుమతించవద్దని.. స్పష్టం చేసింది. స్వీయ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలంది. వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్ చల్లాలని.. చెత్త తొలగించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పేర్కొంది. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో స్వయం, సహాయక సంఘాలను భాగస్వాములను చేయాలని.. వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.
కొవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్య కార్యక్రమాలకు సర్పంచి ఛైర్మన్‌గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 70 శాతానికిపైగా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాయి.
ఇదీ చదవండి: తెలుగురాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం డబుల్ మ్యూటెంట్ వైరసే