Fake NIA officer arrested: నకిలీ ఎన్ఐఏ అధికారి అవతారమెత్తి భయభ్రాంతులకు గురి చేస్తూ, డబ్బులు గుంజుతున్న 20 ఏళ్ల యువకుడిని తెలంగాణలోని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా అదిసర్లపల్లి మండలం, పోతిరెడ్డిపల్లికి చెందిన నార్లనరేష్ దూర విద్యలో డిగ్రీ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలన్న కోరికతో నకిలీ ఆర్మీ, ఎన్ఐఏ అధికారిగా మారాడు. ఇందుకోసం ఆర్మీ వస్త్రాలతో పాటు, ఎయిర్‌పిస్తోల్ కొనుగోలు చేసి, నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. ఆర్మీలో పని చేస్తున్నట్లుగా అందరినీ నమ్మించాడు. ఇటీవలే ఎన్ఐఏ దేశంలో నిషేధిత పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించనట్లుగా వివిధ ప్రసార మాద్యమాల్లో ప్రచారం కావడంతో, అదే అదునుగా భావించి నకిలీ ఎన్ఐఏ అధికారిగా మారాడు.
కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని పీఎఫ్ఐతో సంబంధాలున్నాయని పిస్తోల్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే జైలుకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్‌కి దిగాడు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టగా, కేయూ వద్ద నిందితుడు పోలీసులకు చిక్కాడు. గతంలో జగిత్యాల జిల్లాలోను ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలింది. నిందితుడు వద్ద నుంచి ఆర్మీ యూనిఫాం, ల్యాప్‌టాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, రెండు ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేయూ పరిధిలో ఓ ద్విచక్రవాహన దారుడిని బెదిరించి 20 గ్రాముల బంగారు గొలుసు, రూ.3.600 నగదు, బైక్‌ని అపహరించిన మరోఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.
అంతకుముందు పలువురు యువకులకు నేవీలో ఉద్యోగాలిప్పిస్తానంటూ రూ.5లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు కమిషనర్ తరుణ్ జోషీ తెలిపారు. అధికార్లమని మోసాలు వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ, డబ్బులు వసూలు చేసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
"వరంగల్ జిల్లాలో కేయూసీ లిమిట్స్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ఒకే విధమైన కేసులు. ఊరిలో సర్పంచ్‌తో సహా అందరికి పీఎఫ్ఐలో వర్క్ చేస్తున్నమని వారు నమ్మించారు" -తరుణ్ జోషీ, సీపీ వరంగల్
ఇవీ చదవండి:
- కారును పోలిన గుర్తులు తొలగించాలన్న తెరాస పిటిషన్ కొట్టివేత
- పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
- అమరావతే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని.. రైతులతో రాహుల్