దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు, ప్రభుత్వ చర్యలపై రాష్ట్ర గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ చేశారు. రాజ్‌భవన్ నుంచి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల నుంచి అనూహ్యంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల అంశాన్ని గవర్నర్ ప్రస్తావించారు. అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి.. అవసరమైన చికిత్స అందిస్తున్నారని.. విదేశాల నుంచి 30,693 మంది రాష్ట్రానికి వచ్చినప్పటికీ.. వారందరినీ స్వీయ నిర్భందంలో ఉండాల్సిందిగా ఆదేశించామని చెప్పారు.
ప్రస్తుతం అధికంగా నమోదవుతోన్న కేసుల్లో ఎక్కువ భాగం దిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివే ఉంటున్నాయన్నారు. అక్కడికి వెళ్లిన వారితోపాటు.. వారితో కలిసి తిరిగిన వారిపైనా దృష్టి సారించి వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ వివరించారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ చర్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించి.. అమలు చేస్తున్న చర్యలను సమీక్షించిన విషయాన్ని గవర్నర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని చెప్పారు. ఉద్యాన పంటలు, ఇతర వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులకు, ఆక్వా సాగుదారులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారిని ఆదుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు.
ఇదీ చదవండి: