Venkaiah Naidu Profile: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జూలై 1న జన్మించారు వెంకయ్యనాయుడు. బాల్యంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి వైరాగ్యంతో ఎక్కడికో వెళ్లిపోయినా.. అమ్మమ్మ ఒడిలోనే ఒద్దికగా పెరుగుతూ భవిష్యత్ లక్ష్యాలకు బాటలు వేసుకున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత నెల్లూరులోని వి.ఆర్. కళాశాల నుంచి రాజనీతి శాస్త్రంలో బీఏ.. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్ పూర్తి చేశారు వెంకయ్య. విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌గా పని చేయడం వల్ల క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం అలవడింది.
వెంకయ్య నాయకత్వ ప్రతిభ విద్యార్థి దశలోనే బహిర్గతమైంది. వి.ఆర్. కాలేజితో పాటు ఏయూ పరిధిలోని అన్ని కళాశాలలకూ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1972లో జై ఆంధ్రా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తన అనర్గళ వాక్చాతుర్యంతో ఆయన జనం దృష్టిని ఆకర్షించేవారు. ఆ క్రమంలోనే ఆంధ్ర లా కాలేజీ తరఫున ఏబీవీపీ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో వెంకయ్యనాయుడిపై జాతీయ నేతల దృష్టి పడింది. ఈ సందర్భాన్ని ఆయన జీవితంలో కీలక మలుపుగా పేర్కొనవచ్చు. తర్వాత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మైలు రాయిగా చెప్పే జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో మరింత రాటుదేలారు. ఎమర్జెన్సీ రోజుల్లో 17నెలల పాటు జైలు జీవితం అనుభవించారు.
28 ఏళ్ల వయసులోనే వెంకయ్యనాయుడుకు శాసనసభకు పోటీ చేసేందుకు ఆహ్వానం లభించింది. 1978లో ఆయన జనతా పార్టీ టిక్కెట్ పై ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నెల్లూరు జిల్లాలో మిగతా 10 నియోజకవర్గాలనుంచి ఎన్నికైంది కాంగ్రెస్ అభ్యర్థులే. దేశమంతా ఇందిరా ప్రభంజనం వీస్తున్నా ఉదయగిరిలో వెంకయ్యదే విజయబావుటా. స్వయంగా ఇందిరాగాంధీ ఉదయగిరికి ప్రచారానికి వచ్చినా వెంకయ్యను ఓడించలేకపోయారు. ఆయన తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1980 నుంచి 85 వరకూ భాజపా అఖిల భారత యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 1983లో వెంకయ్య భాజపా టికెట్ పై గెలిచినప్పుడు జిల్లాలో మిగతా 10 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా విజయంతో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు తిరుగులేని నేతగా మారారు.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఎన్టీఆర్‌ను 1984లో అప్రజాస్వామిక మార్గంలో పదవీచ్యుతుడిని చేసేందుకు ఇందిరాగాంధీ చేసిన ప్రయత్నాలను వెంకయ్యనాయుడు ఇతర విపక్ష నాయకుల తో కలిసి వమ్ము చేశారు. 1985 నుంచి 1988 వరకు ఏపీ భాజపా ప్రధాన కార్యదర్శిగా.. 1988 నుంచి 1993 వరకు ఏపీ భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా ప్రసంగించడం చూసి వాజపేయీ, అడ్వాణీలు ఆయనను జాతీయస్థాయికి తీసుకుని వెళ్లారు. అలా 1993లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996 నుంచి 2000 వరకూ భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా.. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా, అధ్యక్షుడిగా పని చేశారు. అప్పుడే ఆయన పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది.
1999 సార్వత్రికఎన్నికల్లో వాజపేయి సారథ్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. వెంకయ్య నాయుడు 2000 సెప్టెంబర్ నుంచి 2002 జూన్ వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు. మొదట.. ఆయన సమకాలీనులంతా ప్రభుత్వంలో చేరితే, వెంకయ్య మాత్రం కేంద్ర కార్యాలయం ద్వారా పార్టీ కోసం పని చేసేందుకు ముందుకు రావడం అగ్రనాయకత్వం అందర్నీ ఆకర్షించింది. అయినా.. వెంకయ్య పనితీరు దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. శాఖ ఎంపిక అవకాశాన్నీ ఆయనకే ఇచ్చింది. అత్యంత కీలకమైన ఆర్థిక ప్రాధాన్యత ఉన్న శాఖలు కోరుకుంటారనుకుంటే వెంకయ్యనాయుడు గ్రామీణాభివృద్ది శాఖను కోరి వాజపేయిని సైతం ఆశ్చర్యపరిచారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కీలక పథకాన్ని ప్రారంభించి దేశంలోని వేలాదిగ్రామాలకు రహదారులు నిర్మించేలా చూశారు.
పార్టీ అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో వాజపేయి, అద్వానీ.. వెంక య్యనాయుడుకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అప్పగించారు. 2002 జూలైలో భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై 2004 చివరి వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో పార్టీ బలోపేతం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు. "ఒక చేతిలో ఎన్డీఏ ఎజెండా, మరో చేతిలో భాజపా జెండా" అన్న నినాదం వెంకయ్య సృష్టించిందే. కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే మంత్రుల్ని సైతం ఆయన పార్టీ కార్యాలయానికి రప్పించి పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు వీలు కల్పించారు. ప్రధానమంత్రి కార్యాలయం- పార్టీకి మధ్య సంధానకర్తగా పనిచేశారు. ఒకప్పుడు వాజ్ పేయి, అద్వానీల పోస్టర్లు అంటించి, వారి సభల కోసం ప్రచారం చేసిన కార్యకర్త స్థాయి నుంచి.. జాతీయ స్థాయిలో వారి మధ్య కూర్చుని వారిద్దరి తర్వాత అత్యంత ప్రాధాన్యత గల నేత తానేనని నిరూపించారు.
2004, 2010లోనూ వెంకయ్య వరసగా రాజ్యసభ ఎంపీ అయ్యారు. 2014లో మోదీ సారథ్యంలో భాజపా అఖండ మెజారిటీతో గెలిచిన తర్వాత పట్టణాభివృద్ది, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖలతో పాటు కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నిర్వహించారు. తర్వాత కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటరీవ్యవహారాల మంత్రిగా పార్లమెంట్ సాఫీగా సాగేలా చూడడంలోనూ, కీలక చట్టాల విషయంలో ఏకాభిప్రాయ సాధనలో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యసభలో పార్టీ మైనారిటీలో ఉన్న సమయంలో కీలక చట్టాలను ఆమోదింపచేసేందుకు ఆయన ప్రతిపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారి మద్దతు సంపాదించేవారు. భూసేకరణ బిల్లు, రియల్ ఎస్టేట్ బిల్లు వంటి ముఖ్యమైన చట్టాలను ఆమోదించగలిగారు. జీఎస్టీ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశారు.
ఇంత నేపథ్యం ఉండబట్టే.. 2017లో దేశమంతా ఉపరాష్ట్రపతిగా ఎవర్ని నియమిస్తారని అనుకుంటున్న సమయంలో ఆ పదవి నిర్వహించేందుకు వెంకయ్య కంటే సమర్థుడు మరొకరు లేరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పార్టీ నేతలంతా భావించారు. వెంకయ్యకున్న అపారమైన రాజకీయ అనుభవం, పార్లమెంటరీ వ్యవహారాల్లో అందెవేసిన చేయి కావడంతో రాజ్యసభ చైర్మన్ గా ఆయనకంటే మించిన వారు దొరకరని భాజపా నాయకత్వం భావించింది. ఫలితంగా ఆయన రాజ్యాంగపరంగా రెండవ అత్యున్నన్నత పదవి స్వీకరించి, ఆ పదవికి వన్నె తీసుకొచ్చేందుకు అహర్నిశలూ కృషి చేశారు.
ఇవీ చదవండి: