Various courses in vedic schools: రాష్ట్రంలోని దేవాదాయశాఖకు చెందిన ఆలయాల పరిధిలో నడుస్తున్న వేద, ఆగమ పాఠశాలల్లో సంప్రదాయ విద్య నేర్చుకుంటున్న విద్యార్థులకు అదనంగా గణితం, ఆంగ్లం, సైన్స్, సోషల్, కంప్యూటర్ కోర్సులు కూడా బోధించేందుకు అనుమతిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో 12 వేద, ఆగమ పాఠశాలలు, ఒక సంస్కృత పాఠశాల ఉన్నాయి.
వీటిలో మరిన్ని విధానాల అమలుకు వీలుగా.. అధికారుల బృందం తిరుపతిలో కంచి మఠం నిర్వహిస్తున్న పాఠశాలను పరిశీలించి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
- వేద, ఆగమ పాఠశాలల్లో విద్యార్థులు మూడు, అయిదు, ఎనిమిది, పది, ఇంటర్మీడియట్‌లో ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. ఈ ఫీజును కూడా ఆ పాఠశాలే చెల్లిస్తుంది.
- ఉదయం, సాయంత్రం కలిపి కనీసం గంటపాటు డ్రిల్ నిర్వహించనున్నారు.
- అవసరమైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని పొరుగు సేవల కింద నియమిస్తారు.
- సంబంధిత పాఠశాలలు నిర్వహిస్తున్న ఆలయ అధికారులు ఒక్కో విద్యార్థి బ్యాంకు ఖాతాలో నెలకు రూ.2 వేల చొప్పున జమ చేయనున్నారు. కోర్సు పూర్తయి బయటకు వెళ్లే విద్యార్థికి అతని ఖాతాలో రూ.3 లక్షల వరకూ అందేలా ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వులపై ఏపీ అర్చక సమాఖ్య శుక్రవారం ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపింది. దీనివల్ల అర్చకుల సంతతి ఈ పాఠశాలల్లో చదివేందుకు ముందుకు వస్తారని, వారి విద్య పూర్తయ్యాక అనేక అవకాశాలు ఉంటాయని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు.
ఇవీ చూడండి: