Variety of Vinayaka Idols : కొవిడ్ కారణంగా రెండేళ్లు కళ తప్పిన వినాయకచవితి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతను జోడించి విభిన్న రూపాల్లో గణేశుడిని తయారుచేశారు. కాలుష్యాన్ని దూరం చేసేలా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ఏర్పాటుచేశారు. తిరుపతి తుమ్మలగుంటలో 7 వేల పైనాపిల్స్‌తో ఏకదంతుని ప్రతిమను కొలువుదీర్చారు. దీనికి అదనంగా మండపానికి ఇరువైపులా మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్లు ఉన్న బాల వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కడప ఊరగాయలవీధిలో ప్రొద్దుతిరుగుడు విత్తనాలతో రూపొందించిన 12 అడుగుల గణేశ్ విగ్రహం ఆకర్షిస్తోంది.
నెల్లూరులో కొబ్బరి గణనాథుడు: నెల్లూరు కనకమహాల్ సెంటర్‌లో ఎండు కొబ్బరితో గణనాథుడిని రూపొందించారు. విజయవాడ నుంచి వచ్చిన కళాకారులు.. 5 రోజులు శ్రమించి ఈ ప్రతిమను రూపొందించారు. రేపాలవారి వీధిలో నెమలి పింఛాలతో ఏర్పాటుచేసిన బొజ్జ గణపయ్య చూడముచ్చటగా ఉన్నాడు. సీఎమ్ఆర్ షాపింగ్ మాల్‌లో ఎండు కొబ్బరి గణపతి కొలువుదీరాడు.
నంద్యాలలో జిల్లేడు గణపతి: నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయం వద్ద తెల్ల జిల్లేడు గణేశుడిని ప్రతిష్టించారు. 18 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని శ్రీ శ్వేతార్క మహాగణపతిగా భక్తులు పూజిస్తున్నారు. కర్నూలు రామలింగేశ్వర నగర్‌లో 7 ద్వారాల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. విశాఖ తాటిచెట్లపాలెంలో యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'గ్రీన్ గణేశ్' విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్లాస్టిక్ వాడకుండా "ప్రపంచాన్ని పచ్చగా ఉంచండి" అనే సందేశాన్నిచ్చేలా ప్రకృతి గణపతిని రూపొందించారు.
రాజమహేంద్రవరంలో విబూది, కాకినాడలో గాజులతో విగ్రహాలు: రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌లో విబూదితో తయారు చేసిన ఐశ్వర్య ఈశ్వర గణపతి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కాకినాడ గ్రామీణ మండలం రామేశ్వరంలో గాజులతో 18 అడుగుల వినాయకుడిని ప్రతిష్టించారు. పెద్ద మార్కెట్‌లో రాగి నాణేలతో కూడిన గణేశుడు కొలువయ్యాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో స్వర్ణ లక్ష్మీమహాగణపతి విగ్రహం ఆకట్టుకుంటోంది. బంగారు పూతతో లక్ష లక్ష్మీకాసులు, కెంపులు, పచ్చలు, అమెరికన్ వజ్రాలతో ప్రతిమను చూడముచ్చటగా అలంకరించారు.
బాపట్లలో కూరగాయల విఘ్నేశ్వరుడు: బాపట్ల జిల్లా సజ్జావారిపాలెంలో వల్లభనేని సత్యసాయిబాబు వివిధ పదార్థాలతో గణేశుని కళాకృతులు చేశారు. కూరగాయలు, బాదం, ఉల్లి, జీడిపప్పు, కొబ్బరి టెంకలతో ఏకదంతుడ్ని తీర్చిదిద్దారు. నంద్యాలకు చెందిన కోటేష్ గణపతి చరిత్రను తెలిపేలా పసుపు, కుంకుమ, కాఫీ పొడితో డ్రాయింగ్ షీట్‌పై వినాయకుడి చిత్రాన్ని గీశాడు. ఇంటర్ విద్యార్థి సాత్విక్ మైక్రో పెన్నుతో 628 సూక్ష్మగణపతి చిత్రాలతో లంబోదరుడిని బొమ్మను వేశాడు.
ఇవీ చదవండి: