బెయిల్ పొడిగించాలంటూ బాంబే హైకోర్టులో సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావు ( Varavara Rao) పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన బాంబే కోర్టు... విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. భీమా కోరేగావ్ కేసులో (Bhima Koregaon case) నిందితుడిగా ఉన్న వరవరరావుకు ఆరు నెలల క్రితం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. 6 నెలలు ముగియడంతో బెయిల్ పొడిగించాలని న్యాయస్థానాన్ని వరవరరావు ( Varavara Rao) కోరారు.
ఇదీ నేపథ్యం
మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో (Bhima Koregaon) 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్ పరిషద్ అనే సంస్థ పుణెలో నిర్వహించిన కార్యక్రమం వెనుకా మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగిన ప్రసంగాలే మర్నాడు బీమా కోరేగావ్ అల్లర్లకు (Bhima Koregaon case) కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో దిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్, రోనా జాకొబ్, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్ పరిషద్‌కు చెందిన సుధీర్ ధవాలె, షోమ సేన్, మహేష్ రౌత్, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్‌లు ఉన్నారు.
లేఖ ఆధారంగా అరెస్ట్
ఈ సందర్భంగా విల్సన్ ఇంట్లో మూడు లేఖలు స్వాధీనం చేసుకున్నామని, వాటిలోని ఒకదాన్లో ప్రధాని మోదీరాజ్‌కు చరమగీతం పాడేందుకు వీలైతే రాజీవ్‌గాంధీ తరహాలో అంతమొందించాలని ఉందని పోలీసులు వెల్లడించారు. మరో లేఖలో వరవరరావు పేరు ఉందని, దేశవ్యాప్తంగా దాడులు జరిపే బాధ్యతలను వరవరరావుకు అప్పగించారని పోలీసులు తెలిపారు. ఈ లేఖ ఆధారంగా 2018 ఆగస్టులో ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
చాలా సార్లు అనారోగ్యం పాలయ్యారు
తర్వాత సుప్రీంకోర్టు వరవరరావు సహా అరెస్టయిన మిగతావారికీ గృహ నిర్బంధం విధించింది. ఈ గడువు ముగియడంతో వరవరరావును ( Varavara Rao) 2018 నవంబరు 17న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన మహారాష్ట్ర జైల్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయన అనేకమార్లు అనారోగ్యానికి గురయ్యారు. కరోనా కూడా సోకడంతో ఆయనను విడుదల చేయాలని కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నాయకులు పలుమార్లు న్యాయస్థానాలను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
మానవతా కోణంలో బెయిల్
వరవరరావు బాంబే హైకోర్టు ఫిబ్రవరిలో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని, వయసును, ఆసుపత్రుల్లోని వసతుల లేమిని దృష్టిలో ఉంచుకొని మానవతా కోణంలో ఆరు నెలలు బెయిల్ మంజూరు చేసింది. 6 నెలలు ముగియడంతో బెయిల్ పొడిగించాలని బాంబే హైకోర్టులో వరవరరావు పిటిషన్ వేశారు.
ఇదీ చదవండి: