తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఎ-1 కుంట శ్రీను, ఎ-2 శివందుల చిరంజీవి, ఎ-3 అక్కపాక కుమార్‌గా ఐజీ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇద్దరు నిందితులను పట్టుకున్నామని చెప్పారు. కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. న్యాయవాది వామన్‌రావు, కుంట శ్రీను మధ్య చాలా రోజులుగా వివాదాలు ఉన్నాయని.. ఊరిలోని భూముల విషయంలో ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది చెప్పారు.
"ఆలయ భూమి విషయంలో ఇద్దరి మధ్య ప్రధాన వివాదం ఉంది. కుంట శ్రీనును పలు అంశాల్లో వామన్‌రావు న్యాయపరంగా అడ్డుకున్నారు. ప్రాణభయం ఉందని వామన్‌రావు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. రక్షణ కల్పించాలని కూడా పోలీసులను ఎప్పుడూ కోరలేదు. చిరంజీవికి కుంట శ్రీను కొన్నిసార్లు ఆర్థికసాయం చేశాడు. కుంట శ్రీనుపై కొన్ని పాత కేసులు ఉన్నాయి. కేసులో దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉంది. హత్య ఘటనను వీడియో తీసిన వారు పోలీసులకు అందించాలి. వామన్‌రావు దంపతులను చంపినవారు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు. ఎవరైనా న్యాయవాదులకు ఇలాంటి పరిస్థితి ఉంటే పోలీసులకు తెలియజేయండి" అని ఐజీ నాగిరెడ్డి తెలిపారు.
హత్య కేసులో వసంతరావు పాత్రపై విచారణ జరుగుతోందని.. కుంట శ్రీనుకు వసంతరావు కారు ఇచ్చారని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కుంట శ్రీను, చిరంజీవి హత్యలో పాల్గొన్నారని.. ఈ ఇద్దరికీ సహకరించిన కుమార్‌ను నిందితుడిగా చేర్చామని చెప్పారు. వసంతరావు పాత్రపై ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేస్తామన్నారు. బిట్టు శ్రీను పాత్రపైనా దర్యాప్తు తర్వాత స్పష్టత వస్తుందని... ఇతరుల పేర్లు ఇప్పుడే చెప్పలేమని ఐజీ వివరించారు. నిందితులు ఎంతటివారైనా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. హత్య వెనక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలియలేదని ఐజీ నాగిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: