అన్ని వర్గాల వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో వాహన మిత్ర లబ్ధిదారులకు మూడో ఏడాది నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డులో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా నియోజకవర్గంలో మూడో విడత అర్హులైన 1170 మంది లబ్ధిదారులకు రూ 1.17 కోట్ల చెక్కును ఎమ్మెల్యే విడదల రజిని అందజేశారు. అనంతరం ఆటో డ్రైవర్లతో కలసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆటో నడిపి సందడి చేశారు. హామీలు నెరవేర్చడంలో సీఎం జగన్ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచారని చెప్పారు.
కర్నూలు జిల్లాలో..
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంలో భాగంగా కర్నూలు జిల్లాలోని 18,107 మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సాయాన్ని జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ప్రజాప్రతినిధులు అందజేశారు. మొత్తం రూ.18,10,70,000 వేల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, తోగురు ఆర్థర్, జేసీలు డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రఘువీరారెడ్డికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు