ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివిటీ రేటు ఏప్రిల్ తొలినాళ్ల నుంచి పెరిగిపోతుండటం పట్ల కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారం వృద్ధిరేటు అత్యధికంగా 30% వరకు ఉందని, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు గంభీరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని కొవిడ్ స్థితిగతులపై శనివారం ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ సుజీత్ కె.సింగ్ వ్యాధి సంక్రమణ తీరుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీప గ్రామాల నుంచి రోగులు పట్టణాలకు వచ్చే అవకాశం ఉన్నందున ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని సూచించారు. కొవిడ్ రకాల్లో వస్తున్న మార్పులపై దృష్టి సారించాలని నిర్దేశించారు. ఇప్పటివరకు 18 కోట్ల డోసులు ప్రజలకు అందించామని, జులై చివరి నాటికి మరో 33.6 కోట్ల డోసులు అందిస్తామని ప్రకటించారు.
స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతులు ఇచ్చామని, కొత్తగా జైడూస్ క్యాడిలా, సీరం ఇన్‌స్టిట్యూట్ నోవావ్యాక్స్, భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్, జెనోవా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు కలిపి ఆగస్టు-డిసెంబర్ మధ్యకాలంలో 216 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని చెప్పారు. ప్రస్తుతం కొవిడ్‌పై ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ ప్రభావం కనిపిస్తోందని, ప్రాణ నష్టం జరగకుండా కాపాడటానికి వీలవుతోందని సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ మంత్రులు అభిప్రాయపడ్డారు.
కేసుల పెరుగుదలలో ఏపీకి 2వ స్థానం:
ప్రస్తుతం దేశంలో నిరంతరం కొవిడ్ కేసుల పెరుగుదల కనిపిస్తున్న 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్ శనివారం విలేకర్ల సమావేశంలో విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో తమిళనాడు తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరిలు చేరాయి. గత రెండువారాలుగా నిరంతరం కేసులు పెరుగుతున్న జిల్లాలు 15 ఉండగా అందులో ఆరో స్థానంలో తూర్పుగోదావరి, పదో స్థానంలో విశాఖపట్నం, 12వ స్థానంలో కడప జిల్లాలు ఉన్నాయి.
మే 8-14 తేదీల మధ్య 25.3% పాజిటివిటీ రేటుతో ఆంధ్రప్రదేశ్ అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. 42.3%తో పుదుచ్చేరి, 42%తో గోవా, 33.4%తో పశ్చిమబెంగాల్ తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి. క్రియాశీలక కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం(2,03,787)లో నిలిచింది. దేశంలోని 516 జిల్లాల్లో 10%కి మించి పాజిటివిటీ రేటు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలూ ఉన్నాయి. 42 జిల్లాలతో మధ్యప్రదేశ్, 37 జిల్లాలతో తమిళనాడు, 35 జిల్లాలతో మహారాష్ట్ర తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి. 17 రాష్ట్రాల్లో కేసులు తిరోగమనంలో సాగుతూ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇదీ చదవండి