తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన షేక్ పాషా అనే వ్యక్తి ఓ రేషన్ దుకాణంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బక్రీద్ పండుగ జరుపుకునేందుకు పట్టణంలోనే ఉంటున్న తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం రోజు చిన్న తోడల్లుడు హుస్సేన్, పెద్ద తోడల్లుడి కొడుకు ఖజోద్దిన్లతో కలిసి షేక్ పాషా మద్యం సేవించడానికి ధరణి వెంచర్‌కు వెళ్లాడు. మద్యం మత్తులో వారి మధ్య గొడవ జరిగింది.
కోపోద్రిక్తులైన హుస్సేన్, ఖజోద్దిన్లు... షేక్ పాషాను దారుణంగా నరికి చంపేశారు. అనంతరం దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చి షేక్ పాషా మృతదేహాన్ని తగలబెట్టారు. అనంతరం ఏమీ జరగనట్లుగా ఇంటికి వెళ్లి అందరితో కలిసిపోయారు. సోమవారం రాత్రి వరకూ షేక్ పాషా ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు... హుస్సేన్, ఖజోద్దిన్లను గట్టిగా నిలదీశారు. మద్యం మత్తులో షేక్ పాషాని తామే చంపినట్లు వారిద్దరూ ఒప్పుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షేక్ పాషా గత కొద్ది రోజులుగా తన భార్య, పిల్లలను కొడుతూ హింసించడం వల్లే తాము హత్య చేసినట్లు నిందితులు చెబుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి:
భార్యతో సంబంధం పెట్టుకున్నాడని హత్య.. కేసు ఛేదించిన పోలీసులు