ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త వినిపించింది. బస్సు దిగాక మోపెడంత లగేజీతో ఆటోలు, క్యాబులంటూ చికాకు పడే అవసరం లేకుండా... ఇంటి వద్దకే బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మీ పరిసర ప్రాంతాల్లో ఉండే వారంతా సుమారు 35 నుంచి 40 మంది వరకు ఉంటే వారికి ఓ ప్రత్యేక బస్సును... ప్రత్యేక బస్సులకు చెల్లించే ఛార్జీలనే చెల్లించి వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా ఆర్టీసీ సేవలను విస్తరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీకి ఫోన్లు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
ఒకే ప్రాంతంలో ఉన్నవారికి బొనాంజా...
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, నెల్లూరు, భీమవరం, విశాఖపట్టణం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, ఉదయగిరి, కందుకూరు, చీరాల, విజయవాడ, గుంటూరు, ఏలూరు నగరాలు... తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సులు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒకే ప్రాంతానికి చెందిన వారంతా... తెలంగాణలోని ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మేస్త్రీలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారు తమ ప్రాంతానికి ప్రత్యేక బస్సులను నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు.
ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా...
సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఈనెల 8 నుంచి 14 వరకు 4,980 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపిస్తుందని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ఈ బస్సులు జంట నగరాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు నడిపిస్తున్నామన్నారు. ప్రత్యేక బస్సులను సమర్థవంతంగా నడిపించేందుకు, ప్రయాణికులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెబీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి అధీకృత టికెట్ బుకింగ్ పాయింట్ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
ఏపీలోని ముప్పై ప్రాంతాలకు...
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఆంద్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు కూడా సంక్రాంతి ప్రత్యేక బస్సులను నడపడానికి నగరంలోని వివిధ పాయింట్ల నుంచి ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కేపీహెచ్‌బీ, దిల్సుఖ్నగర్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి వివిధ ప్రాంతాలకు నడిపిస్తామన్నారు.
రోజూ నడిపే బస్సులకు అదనంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు జంట నగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 3,380 బస్సులు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిద ప్రాంతాలకు సుమారు 1,600 బస్సులు ప్రయాణికుల సౌకర్యార్ధం నడిపిస్తున్నామన్నారు. ఈనెల 8 నుంచి 14 వరకు అదనపు బస్సుల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ (www.tsrtconline.in) ఏర్పాటు చేశామన్నారు.
ఏ పాయింట్ నుంచి ఏ బస్సులు...
- జూబ్లీ బస్ స్టేషన్, పికెట్ నుంచి : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు వెళ్లే షెడ్యూలు, స్పెషల్ బస్సులు నడిపిస్తారు.
- సీబీఎస్ నుంచి : కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచెర్ల, నెల్లూరు వైపు షెడ్యూలు, స్పెషల్ బస్సులు నడిపిస్తారు.
- ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి : యాదగిరిగుట్ట, వరంగల్ వైపు వెళ్లు షెడ్యూలు స్పెషల్ బస్సులు నడిపిస్తారు.
- దిల్సుఖ్నగర్ బస్‌స్టేషన్ నుంచి : మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లు షెడ్యూలు స్పెషల్ బస్సులు నడిపిస్తారు.
ఎంజీబీఎస్‌లో ప్లాట్‌ఫాంల వారీగా బస్సుల వివరాలు :
ఫ్లాట్‌ఫాం నంబర్ | సెక్టార్ వివరాలు |
01-05 | వెన్నెల, గరుడ ప్లస్, గరుడ, అంతర్ రాష్ట్ర షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
06-07 | బెంగళూరు వైపు వెళ్లు బస్సులు |
10-13 | ఖమ్మం వైపు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
14-15 | దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్కు ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సు |
18-19 | ఉప్పల్, ఉప్పల్ ఎక్స్ రోడ్‌కు ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సు |
23-25 | శ్రీశైలం, కల్వకుర్తి వైపు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
26-31 | రాయచూర్, మాహబూబ్నగర్ వైపు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
32-34 | నాగర్‌కర్నూల్, షాద్‌నగర్ వైపు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
35-36 | విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
41-42 | పెబ్బేర్, కొత్తకోట, గద్వాల్ వైపు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
46-47 | మెదక్, బాన్సువాడ, బోధన్ వైపు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
48-52 | జహీరాబాద్, బీదర్, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్ వైపు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
53-55 | జేబీఎస్‌కు ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సు |
56-58 | నాగ్‌పూర్, అమరావతి, నాందేడ్, అకోలా సర్వీసులు |
62 | దేవరకొండ వైపు వెళ్లు షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు |
63-65 | పరిగి, తాండూరు, వికారాబాద్ వైపు వెళ్లు సర్వీసులు |