పిల్లల ఆటబొమ్మలకు తయారీలో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉండాలి. ఇదీ మన్-కీ-బాత్ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు. పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల జీవితంలో ఆట బొమ్మలకు గల ప్రాధాన్యం గురించి వివరించారు. ఆటబొమ్మలు బాలలకు చాలా ముఖ్యమైనవని చెప్పారు. బొమ్మల గురించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్- అన్న మాటల్ని గుర్తు చేశారు. ఆట బొమ్మల ప్రాధాన్యాన్ని వివరించారని వెల్లడించారు. ఆట బొమ్మల తయారీ కేంద్రంగా భారత దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
పిల్లల సర్వతోముఖ వికాసానికి తోడ్పాటు...
పిల్లల మనోవికాసానికి ఆటబొమ్మలు ఉపయోగపడతాయి. వారి ఆలోచన శక్తిని పెంచుతాయి. సృజనాత్మకతను వెలికి తీస్తాయి. బాల్యంలో బొమ్మలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు బొమ్మలతోనే పెరుగుతారు.. కాబట్టి వారు చాలా విషయాలు నేర్చుకోవటానికి ఇవి ఎంతో దోహదపడతాయి. బొమ్మలు వినోదాన్ని పంచడమే కాకుండా.. ఆలోచనల్ని రేకెత్తిస్తాయన్నారు. ప్రధాని ఇదే విషయాన్ని మన్ కీ బాత్ ద్వారా చెప్పారు. దేశీయంగా ఉత్పత్తులు పెంచడంపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతూ యువ ఔత్సాహికులు ఆట బొమ్మల తయారీకి నడుం బిగించాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చారు.
బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించాలి...
ప్రపంచ ఆటబొమ్మల తయారీలో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని.. ఇది ఏ మాత్రం సరికాదని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఆటబొమ్మల తయారీలో మన దేశం మరింత కృషి చేయాలని.. ఈ పరిస్థితిని మెరుగు పరచడానికి మనం జట్టుగా కృషి చేయాలని సూచించారు. అదే సమయంలో స్థానిక బొమ్మల తయారీలో భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందని ప్రధాని వివరించారు. అంతిమంగా దేశీయ బొమ్మలను భారీగా తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరూ ముందుకురావాలని ప్రధాని కోరుతున్నారు.
- ఉపాధికి విస్తృత అవకాశాలు...
మోదీ ఇచ్చిన పిలుపులో... పరోక్షంగా స్వయం సమృద్ధి భారత్ దిశగా అడుగులు పడాలనే సూచనలు కనిపిస్తున్నాయి. మన కళా నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు... కీలకమైన బొమ్మలను ఆసరాగా చేసుకోవాలనే తలంపు కనిపిస్తోంది. మన కళాకారుల ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినట్లైతే.. దేశ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తుంది. అదే సమయంలో.. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించినట్లవుతుంది. అలాగే ప్రధాని బొమ్మల తయారీ కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగానికి... అదీ ఒక సమాధానంగా నిలుస్తుందని ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దగా యువత ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లైతే.. ఉపాధి కల్పనతో పాటు విస్తృతమైన అవకాశాలు అందుకోవచ్చు.
పూర్వవైభవం తెచ్చేందుకు కసరత్తు...
ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా సాగి సమస్త ప్రపంచానికి ఆట బొమ్మల కేంద్రంగా నిలిచే సత్తా దేశానికి ఉన్నదన్నది... ప్రధాని మాట. ముఖ్యంగా దేశంలో అన్ని రంగాల్లో భారత్‌లో తయారీకి పెద్దపీట వేస్తున్నారు. అన్నీ దేశంలోనే తయారు చేయాలనే వాదనలు పెరిగిన నేపథ్యంలో.. అత్మ నిర్భర భారత్‌లో బొమ్మల తయారీ కూడా కీలకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం.. దేశంలో చైనా టాయ్స్‌దే హవా. విచ్చలవిడిగా దేశీయ విపణిలోకి వచ్చి పడుతున్న చౌకబారు బొమ్మలతో... దేశంలో తయారవుతన్న సంప్రదాయ బొమ్మలకు అనేక చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ... దేశంలో కుటీర పరిశ్రమగా ఉన్న బొమ్మల తయారీ భారంగా మారుతోంది. ప్రధాని చెప్పినట్లుగా... దేశంలో బొమ్మల తయారీ పునర్వైభవం దిశగా అడుగులేస్తే ఎన్నో రకాలుగా లాభం చేకూరే అవకాశం కనిపిస్తోంది.
చైనా ఉత్పత్తులను నియంత్రించేందుకే...
ప్రధాని తీసుకున్న నిర్ణయంలో... చైనాను-చైనా ఉత్పత్తులనూ కట్టడి చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. సరిహద్దులో భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు, డ్రాగన్ దేశం కవ్వింపు చర్యలకు సమాధానంగా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా బాయ్‌కాట్ చైనా అనే నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. యాప్‌ల నిషేధంతో ప్రభుత్వం సైతం చైనాను.. హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని ఇచ్చిన పిలుపు.. చైనాను కలవరపెట్టేదే. ఎందుకంటే. ప్రస్తుతం ఆట బొమ్మలు అత్యధికంగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. అయితే మన దేశానికి ఎగుమతులు చేసి, లాభాలు ఆర్జించే చైనా, మనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో... ఈ నిర్ణయం చైనా ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టేదే.
మన బొమ్మలు సురక్షితం...
దేశంలోనే బొమ్మలు తయారు చేసినట్లైతే.. ఉపాధి కల్పన, ఆత్మ నిర్భరతతో పాటు మరిన్ని లాభాలు చేకూరే అవకాశాలున్నాయి. దిగుమతి చేసుకున్న బొమ్మలన్నీ ప్లాస్టిక్, రబ్బర్‌తో తయారు చేస్తుంటారు. వీటికి అనేక రంగులు, రసాయనాలు కలుపుతుంటారు. దీనివల్ల పిల్లలు ఆడుకునే సమయంలో నోట్లో పెట్టుకుని అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి. కానీ మన స్వదేశీ బొమ్మలు ఎక్కువగా కొయ్యతో చేస్తారు. సహజమైన రంగులే అద్దుతారు. అలాగే బొమ్మలో ఎక్కడా పదునైనా అంచులు ఉండవు. మొత్తంగా బొమ్మని ఎక్కడ పట్టుకున్నా గుండ్రంగా, నునుపుగా ఉంటుంది. దీనివల్ల పిల్లలకు ఎలాంటి గాయాలు కావు. అదే సమయంలో వారికి బాల్యంలోనే దేశీయ సంస్కృతి-సంప్రదాయాలను పరిచయం చేసినట్లు ఉంటుంది. ఈ తరహా అంశాలన్నీ పరిగణలోకి తీసుకునే... కేంద్రం స్వదేశీ బొమ్మలకు పట్టం కట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమ పెద్దది. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేశీయ బొమ్మలకు గుర్తింపు రావాలంటే.. సాధ్యమైనంత వేగంగా ఈ రంగంలో మార్పులు చేపట్టి.. విస్తరణకు అవకాశాలు కల్పించాలని అంటున్నారు నిపుణులు
ఇదీ చూడండి: ప్రణబ్ మృతిపట్ల ప్రపంచ దేశాల సంతాపం