తెలంగాణ రాష్ట్రంలో టమాటా రైతులు దారుణంగా నష్టపోతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా నామమాత్రపు ధర కూడా దక్కడంలేదు. క్వింటా టమాటాకు రూ.900 దక్కితే రైతుకు గిట్టుబాటవుతుందన్నది ఉద్యానశాఖ లెక్క. ప్రస్తుతం రూ.100 నుంచి రూ.250 మాత్రమే దక్కుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వినియోగదారులకు మాత్రం టోకు, చిల్లర వ్యాపారులు కలిసి కిలో టమాటాను రూ.10 నుంచి రూ.15కు అమ్ముతుండటం గమనార్హం.
- తెలంగాణలో 40 వేల ఎకరాల్లో టమాటా పంటను ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో రైతులు సాగుచేశారు.
- హైదరాబాద్ నగరం మొత్తానికి రోజూ బోయిన్‌పల్లి మార్కెట్‌కు రైతులు తెచ్చే కూరగాయల పంటలే కీలకం. అక్కడ పలికే టోకు ధరను బట్టి నగరంలో చిల్లర ధరలు నిర్ణయిస్తారు. ఈ మార్కెట్‌లో ఈ నెలారంభంలో కిలో టమాటాలకు రూ.12 వరకూ ధర పలకగా ఆదివారం రూ.2 నుంచి రూ.4 మాత్రమే చెల్లించారు.
- ఆదివారం మొత్తం 1,367 క్వింటాళ్ల టమాటాలు రాగా అందులో కేవలం 3.15 శాతం(43 క్వింటాళ్ల)కే కిలో రూ.4 చొప్పున ఇచ్చారు. మరో 250 క్వింటాళ్లకు కిలోకు రూపాయి, మరో 875 క్వింటాళ్లకు కిలోకు రూ.2 చొప్పున చెల్లించి టోకు వ్యాపారులు కొన్నారు. వీరు, చిల్లర వ్యాపారులు కమీషన్ వేసుకుని వినియోగదారులకు రూ.10 నుంచి 15 వరకూ విక్రయించారు.
- క్వింటా టమాటా పంట పండించడానికి రైతు సగటున రూ.600 దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ఉద్యానశాఖ అధ్యయనంలో గుర్తించారు. పంట కోత, రవాణా, ఇతర ఖర్చులు మరో రూ.300 వరకూ అవుతాయి. ఈ క్రమంలో క్వింటాకు కనీసం రూ.900 చెల్లిస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని ఆ శాఖ పేర్కొంటోంది.
- రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగినందున వచ్చే నెలాఖరు దాకా ధరలు పెరిగే అవకాశం లేదని మార్కెటింగ్ శాఖ అధికారి ఒకరు ‘ఈటీవీ భారత్కు చెప్పారు.
పంటను వదిలేస్తున్నా..
టమాటాలు కోయడానికి కూలీలను పిలిస్తే ఒక్కో కూలీకి రోజుకు రూ.300 నుంచి రూ.400 అడుగుతున్నారని... కూలీ, రవాణా ఖర్చులు భరించలేక పంటను కోయకుండా వదిలేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు నర్సయ్య వాపోయారు.
సాగు, దిగుబడి పెరగడంతో..
"టమాటాల ధర భారీగా పతనమైన మాట వాస్తవమే. పంట సాగు, దిగుబడి పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వెల్లువలా రావడమే ఇందుకు ప్రధాన కారణం. సంక్రాంతి పండగ కారణంగానూ అమ్మకాలు తగ్గడంతో డిమాండ్ లేక ధరలు పతనమయ్యాయి."
- ఎల్.వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు, ఉద్యానశాఖ
ఇదీ చదవండి: