BJP PROTEST: కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు భాజపా పిలుపునిచ్చింది. శ్రీకాంత్ రెడ్డిపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టనుంది. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమ నేతలపై కేసు పెట్టారని భాజపా ఆరోపించింది. భాజపా నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలన్న వారు.. అరైస్టై నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే?
ఆత్మకూరు పట్టణంలో ఓ నిర్మాణం విషయంలో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో.. రాళ్లు రువ్వుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ఓ వర్గంవారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి కారు ఒక్కసారిగా మనుషులపైకి వెళ్లటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన మరో వర్గం.. శ్రీకాంత్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు.. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఆత్మకూరు పట్టణానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు.
ఆత్మకూరు పట్టణంలో పరిస్థితి అదుపులో ఉంది. శనివారం అల్లర్లకు పాల్పడిన వారిపై 5 కేసులు నమోదు చేసి.. 28 మందిని అరెస్టు చేశాం. ఈ ఘటనలో ఓ కారు సహా మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -సుధీర్ కుమార్ రెడ్డి , కర్నూలు ఎస్పీ
నేడు శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించనున్న సోమువీర్రాజు
కడప జైలులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి, ఇతర నేతలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శించనున్నారు. ఆత్మకూరులో వాహనాలకు నిప్పుపెట్టినా పట్టించుకోలేదన్న భాజపా.. న్యాయం కోసం గవర్నర్, సీఎస్, డీజీపీని కలవాలని నిర్ణయించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, సబ్కలెక్టర్లు, ఆర్డీవోలకు మెమోరాండం అందించనున్నారు.
ఇదీ చదవండి: