Amaravati Movement: రాష్ట్ర విభజన తర్వాత ఒక మహానగరం లేని ఆంధ్రప్రదేశ్‌కు ఆశాకిరణంగా రాత్రింబవళ్లు శరవేగంగా జరుగుతున్న రాజధాని అమరావతి నిర్మాణాన్ని వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపేసింది. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసి చివరకు 3 రాజధానుల పేరుతో విధ్వంసానికి తెరలేపింది. 2019 డిసెంబరు 17న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన 3 రాజధానుల ప్రకటనతో ఉవ్వెత్తున ఎగిసిన అమరావతి పరిరక్షణ ఉద్యమ జ్వాల ప్రభుత్వ దమనకాండకు, ఎన్నో కాలపరీక్షలకు తట్టుకుని నిలిచింది. ఎన్నో కష్టనష్టాలను, ఆంక్షలను, బెదిరింపులు, అక్రమ కేసులను ఎదుర్కొని రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో చేస్తున్న ఉద్యమం సోమవారానికి వెయ్యో రోజుకు చేరుకుంది. ఈ వెయ్యి రోజుల అమరావతి ఉద్యమ ప్రస్థానంలో ముఖ్యఘట్టాలివి.
2019 డిసెంబరు 17: మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ శాసనసభలో సీఎం జగన్ ప్రకటన
2019 డిసెంబరు 18: సీఎం ప్రకటనకు నిరసనగా ఉవ్వెత్తున ఉద్యమం ప్రారంభించిన రాజధాని రైతులు. రాజధాని గ్రామాల్లో వివిధ రూపాల్లో నిరసనలు. రైతులకు మద్దతుగా గుంటూరు, విజయవాడవంటి చోట్ల నిరసన ప్రదర్శనలు.
2019 డిసెంబరు 20: పరిపాలనను వికేంద్రీకరించాలని విశ్రాంత ఐఏఎస్ జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫారసు.
2019 డిసెంబరు 29: జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సిఫారసులపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ నియామకం.
2020 జనవరి 3: మూడు రాజధానుల్ని సిఫారసు చేస్తూ బీసీజీ నివేదిక.
2020 జనవరి 7: చినకాకాని వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన రాజధాని రైతులు. రైతులతో పోలీసుల ఘర్షణ.
2020 జనవరి 10: పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు విజయవాడ దుర్గగుడికి వెళుతున్న రాజధాని మహిళలు, రైతులపై పోలీసుల దాష్టీకం. వెలగపూడి వద్ద రణరంగంగా మారిన సీడ్‌యాక్సెస్ రోడ్డు.
2020 జనవరి 20: చలో అసెంబ్లీకి రాజధాని రైతుల పిలుపు. అసెంబ్లీ సమీపానికి చేరుకున్న రైతులు. పోలీసుల లాఠీఛార్జి.
2020 జనవరి 20: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ.
2020 జనవరి 22: బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్‌కు తెదేపా సభ్యుల నోటీసు. సభలో గందరగోళం. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ అప్పటి మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం.
2020 జనవరి 27: నిబంధనల ప్రకారం తన విచక్షణాధికారాన్ని వినియోగించే రాజధాని బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపించానని అప్పటి శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ స్పష్టీకరణ.
2020 ఫిబ్రవరి 10: నిబంధనలు పాటించనందున బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేమంటూ మండలి ఛైర్మన్‌కు తిప్పిపంపిన ఇన్‌ఛార్జి సెక్రటరీ.
2020 మార్చి 26: వందో రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం.
2020 జూన్ 16: ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం.
2020 జూన్ 17: కౌన్సిల్‌లో తెదేపా సభ్యుల ఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు.
2020 జులై 4: 200వ రోజుకు చేరిన ఉద్యమం.
2020 జులై 18: బిల్లుల్ని గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం.
2020 జులై 31: బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర.
2020 ఆగస్టు 8: సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల చట్టాల్ని సవాలు చేస్తూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి కేసు.
2020 అక్టోబరు 12: 300వ రోజులకు చేరిన ఉద్యమం.
2020 అక్టోబరు 23: మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహిస్తున్న దీక్షలో పాల్గొనేందుకు రాజధానికి బయట ప్రాంతాలకు చెందినవారు ఆటోల్లో వస్తుంటే వారిని కొందరు రైతులు కృష్ణాయపాలెం వద్ద అడ్డుకున్నారు. కొంత ఘర్షణ జరిగింది. మంగళగిరి మండల వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవిబాబు ఫిర్యాదుతో 11 మంది రైతులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిలో ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు బీసీలు ఉన్నారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం రాజధాని రైతులపై వేధింపులకు పరాకాష్ట. ఫిర్యాదు చేసిన రవిబాబు.. దాన్ని వెనక్కు తీసుకుంటానని చెప్పినా కూడా రైతుల్ని పోలీసులు రిమాండ్‌కు పంపారు.
2020 అక్టోబరు 27: అరెస్టు చేసిన ఏడుగురు రైతుల్ని నరసరావుపేట సబ్‌జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు.. ఉగ్రవాదులకో, దోపిడీ దొంగలకో వేసినట్టు చేతులకు బేడీలు వేసి తరలించడం తీవ్ర వివాదాస్పదమైంది. పోలీసుల తీరుపై ఎస్సీ సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి.
2020 డిసెంబరు 17: ఏడాది పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం.
2021 మార్చి 8: మహిళా దినోత్సవం సందర్భంగా దుర్గ గుడికి వెళుతున్న మహిళా రైతుల్ని అడ్డుకున్న పోలీసులు. మహిళలపై దురుసు ప్రవర్తన. గాయపడ్డ కొందరు మహిళలు.
2021 ఏప్రిల్ 30: 500 రోజుకు చేరిన అమరావతి ఉద్యమం.
2021 ఆగస్టు 8: 600 రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం.
2021 నవంబరు 1: ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన రైతులు. పాదయాత్ర అమరావతిలో మొదలై తిరుపతి చేరేంతవరకు అడుగడుగునా పోలీసుల అడ్డంకులు. రైతులకు ఆశ్రయం ఇచ్చినవారికి వేధింపులు. రాత్రి బస కోసం ముందే కల్యాణమండపాలు వంటివి బుక్ చేసుకున్నా.. వారికి ఇవ్వకుండా యజమానులకు బెదిరింపులు. పోలీసుల ఆంక్షలు, వేధింపులతో అనేక అవస్థలు పడుతూ విజయవంతంగా, శాంతియుతంగా యాత్ర కొనసాగించిన రైతులు.
2021 నవంబరు 11: ప్రకాశం జిల్లాలోని చదలవాడ వద్ద పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపైనా, వారికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చినవారిపైనా పోలీసుల దాడి. లాఠీఛార్జి. పలువురికి గాయాలు.
2021 నవంబరు 16: 700 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం.
2021 నవంబరు 22: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.
2021 డిసెంబరు 17: పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో అమరావతి రైతుల విజయోత్సవ సభ. వివిధ పార్టీల నాయకుల సంఘీభావం. హాజరైన తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణ, భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, జనసేన నాయకుడు హరిప్రసాద్ తదితరులు
2022 ఫిబ్రవరి 24: 800 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం
2022 మార్చి 3: రాజధానిని మూడు ముక్కలు చేయడం కుదరదని, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు చారిత్రక తీర్పు. నెల రోజుల్లో రాజధానిలో ప్రధాన మౌలిక వసతులను కల్పించాలని, భూములిచ్చిన రైతులకు మూడు నెలల్లోగా అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగించాలని, ఆరు నెలల్లో రాజధాని నిర్మించాలని ప్రభుత్వానికి ఆదేశం.
2022 ఏప్రిల్ 1: రాజధాని నిర్మాణానికి ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధికి నెల రోజులు చాలవని, 60 నెలలు కావాలంటూ హైకోర్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్. నిధుల కొరత ఉందని వెల్లడి.
2022 ఏప్రిల్ 21: రాజధానిపై ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన రాజధాని రైతులు.
2022 జూన్ 4: 900వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం. రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడలో జరిగిన సభకు హాజరైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ, విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలరావు, ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు.
2022 జూన్ 6: రాజధాని రైతులకు స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు ఐదేళ్లు పడుతుందని, గడువు పొడిగించాలని హైకోర్టులో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అఫిడవిట్. రుణం కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి.
2022 జులై 11: రైతులు వేసిన కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి. కోర్టు తీర్పును ఉల్లంఘించలేదని, రాజధానిలో కరకట్ట రోడ్డు విస్తరణ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారుల అపార్టుమెంట్ టవర్లలో పెండింగ్ పనులు సహా మరికొన్ని పనులు ప్రారంభించామని వెల్లడి. బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నామని, అదే సమయంలో నిధుల సమీకరణకు కొన్ని భూములు వేలం వేయాలని నిర్ణయించినట్టు వెల్లడి.
2022 ఆగస్టు 23: ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను అక్టోబరు 17కు వాయిదా వేసిన హైకోర్టు.
2022 సెప్టెంబరు 7: విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని వంటి బయటి ప్రాంతాలకు చెందినవారికి రాజధానిలో 50వేలకుపైగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేయడం, మాస్టర్‌ప్లాన్ ఉల్లంఘించడం కుదరదని కోర్టు స్పష్టం చేయడంతో.. ప్రభుత్వం కొత్త ఎత్తుగడ. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధానిలో ఇళ్ల పట్టాలిచ్చేలా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు వీలు కల్పిస్తూ సీఆర్‌డీఏ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదముద్ర.
2022 సెప్టెంబరు 12: వెయ్యో రోజుకు అమరావతి ఉద్యమం. అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర ప్రారంభిస్తున్న రాజధాని రైతులు.
ఇవీ చదవండి: