రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు శుక్రవారమూ కొనసాగాయి. జీఓ 35లోని నిబంధనలను అమలు చేయడంలేదన్న కారణాలతో పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. లోపాలపై యజమానులకు నోటీసులు జారీచేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యజమానులు బోర్డులు పెడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఓ థియేటర్ ముందు ‘ప్రొజెక్టర్ మరమ్మతులో ఉన్నందున థియేటర్ మూసివేశాం. మరమ్మతుల అనంతరం చిత్రాలు ప్రదర్శిస్తాం’ అని, మరో థియేటర్ ముందు ‘ఈరోజు సెలవు’ అని బోర్డు పెట్టారు. విశాఖ జిల్లా అరకు, ఎస్.రాయవరం, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, ప్రకాశం జిల్లా సింగœరాయకొండలో మొత్తం అయిదు థియేటర్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు.
విస్తృత తనిఖీలతో బెంబేలు
గుంటూరు జిల్లాలో 70 థియేటర్లను అధికారులు తనిఖీ చేసిన అధికారులు 35 సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేశారు. నాలుగింటిని సీజ్ చేశారు. కొన్నింటికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. విశాఖలో కలెక్టర్ మల్లికార్జున, ఆర్డీఓ పి.కిషోర్‌లు థియేటర్లు తనిఖీచేశారు. జగదాంబ థియేటర్‌లో త్రీడీ అద్దాల కోసం అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వివరణ కోరుతూ నోటీసు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని తిరుమల థియేటర్‌లో అధిక ధరలకు పానీయాలు విక్రయిస్తున్నారని నోటీసు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఒక థియేటర్‌ను సీజ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నాలుగింటికి నోటీసులు అందచేశారు. కర్నూలులో ఓ థియేటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ తనిఖీ చేశారు.
కృష్ణా జిల్లాలో 30 థియేటర్లలో నిలిచిన ప్రదర్శనలు
టిక్కెట్ల ధరలు తగ్గించడంతో కృష్ణా జిల్లాలో 18 సినిమా థియేటర్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. నిబంధనలు పాటించడంలేదంటూ అధికారులు 12 థియేటర్లను మూయించారు. దీంతో మొత్తమ్మీద కృష్ణా జిల్లాలో ప్రస్తుతం నడవని థియేటర్ల సంఖ్య 30కి చేరింది. మరికొన్ని మూతబడబోతున్నాయని విజయవాడలోని అలంకార్ థియేటర్ యజమాని, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు కాకుమాను ప్రసాద్ ‘ఈనాడు’కు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా(45) తర్వాత ఎక్కువ సంఖ్యలో మూతబడిన థియేటర్లు కృష్ణాలోనే ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనూ 23 సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: సినిమా చూపించలేను మావా..! ఆందోళనలో ఏపీ ఎగ్జిబిటర్లు.. అసలేం జరుగుతోంది..?