పొరుగున తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒకేసారి 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో.. ఏపీలోని నిరుద్యోగుల్లోనూ చర్చ మొదలైంది. రాష్ట్రంలో తెదేపా హయాంలో 2018 నవంబరు, డిసెంబరుల్లో పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. అప్పట్లో 334 ఎస్సై, 2,723 కానిస్టేబుల్ స్థాయుల్లోని పోస్టుల భర్తీకి ప్రకటన వచ్చింది. తర్వాత మరో నోటిఫికేషనే లేదు. ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన ఈ ఉద్యోగాలకు అప్పట్లో 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఏడెనిమిది లక్షల మంది యువత పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏళ్ల తరబడి పట్టణాలు, నగరాల్లో గదులు అద్దెకు తీసుకుని, శిక్షణ కేంద్రాల్లో చేరి, వేలల్లో ఖర్చు చేస్తున్నట్లు నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
4 ఏళ్లు.. ఏటా 6,500
రానున్న నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. డిసెంబరులో ఖాళీల్ని గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం. ప్రస్తుత ఖాళీలతో పాటు వారాంతపు సెలవు విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపడతాం. -2020 అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్
యువత మనోధైర్యం కోల్పోతుంటారు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందోనని విద్యార్థులు ఎదురుచూస్తారు. శిక్షణకు ఎంత సమయం కేటాయించాలా అని ఆలోచిస్తారు. జిల్లా కేంద్రాలు, నగరాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని శిక్షణ పొందుతుంటారు. నెలల తరబడి నోటిఫికేషన్లు రాక, అవి ఎప్పుడిస్తారో తెలియక మనోధైర్యం కోల్పోతుంటారు. ఈ పరిస్థితి మారుస్తూ రాబోయే 9 నెలల్లో అంటే జులై నుంచి 2022 మార్చి వరకూ ఏయే ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తామో వివరిస్తూ జాబ్ క్యాలెండర్ తెస్తున్నాం. - 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా సీఎం జగన్
నిరుత్సాహమొద్దు.. ఓపికతో ఉండాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే 15 వేల మంది మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో విలీనం చేశాం. వారికి అత్యవసరంగా శిక్షణ ఇవ్వడం తొలి ప్రాధాన్యం కావడంతో జాబ్ క్యాలెండర్‌లో ఈ దఫా 6,500 పోలీసు పోస్టుల భర్తీ తాత్కాలికంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది నుంచి 6,500 చొప్పున నాలుగేళ్ల పాటు భర్తీ చేస్తాం. ఆశావహులు నిరుత్సాహ పడకుండా ఓపికతో ఉండాలి. - 2021 జులై 5న మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్
- పోలీసు శాఖలో 14,613 ఖాళీలు
- వాటిలో కానిస్టేబుల్ స్థాయి పోస్టులే 12,182
- బీపీఆర్‌డీ నివేదిక-2021లో వెల్లడి
రాష్ట్ర పోలీసుశాఖలో 14,613 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) పేర్కొంది. 2021 జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని పోలీసు విభాగాల్లో కలిపి మొత్తం పోస్టులు 75,365 కాగా 60,752 మందే ఉన్నారని వెల్లడించింది. ప్రధానంగా క్షేత్ర స్థాయి పోస్టులైన కానిస్టేబుల్-12,182, ఎస్సై-505 పోస్టుల ఖాళీలు ఉన్నాయని వివరించింది. ఏపీ పోలీసు శాఖలో మంజూరైన పోస్టులకు అనుగుణంగా ప్రతి లక్ష జనాభాకు 143.09 మంది పోలీసులు ఉండాలని, 115.35 మందే ఉన్నారని తెలిపింది. 2021 సంవత్సరానికి సంబంధించిన బీపీఆర్‌డీ నివేదిక తాజాగా విడుదలైంది. దాని ప్రకారం రాష్ట్రంలో మంజూరైన పోస్టులను బట్టి ప్రతి 698.85 మంది జనాభాకు ఒక పోలీసు ఉండాలి. కానీ 866.95 మందికి ఒకరున్నారు. ప్రతి 2.16 చ.కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒక పోలీసు ఉండాలి. కానీ 2.68 చ.కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒకరున్నారు.
ఆ షెడ్యూలు మార్చితోనే ముగిసింది..
పోలీసులకు వారాంతపు సెలవు విధానాన్ని అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. తొలినాళ్లలో 2019 జూన్ 19 నుంచి నాలుగైదు నెలల పాటు కొనసాగించింది. సిబ్బంది కొరత, ఇతర కారణాలతో దాన్ని పక్కనపెట్టేసింది. వీక్లీ ఆఫ్ పక్కాగా అమలు చేయాలంటే ప్రస్తుతమున్న ఖాళీల భర్తీతో పాటు అదనంగా మరో 8-10 వేల పోస్టులు నింపాలని పోలీసు శాఖ గతంలో ప్రభుత్వానికి నివేదించింది. ఈ లెక్కన 22-23 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఏటా 6,500 చొప్పున నాలుగేళ్ల పాటు పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించి ఏడాదిన్నరపైనే గడిచింది. గతేడాది జూన్‌లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 10,143 కొలువులు భర్తీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. 450 పోలీసు ఉద్యోగాల భర్తీకి 2021 సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. క్యాలెండర్ ప్రకారం ఆ షెడ్యూలు ఈ ఏడాది మార్చితో ముగిసిపోయింది. నోటిఫికేషన్ మాత్రం రాలేదు.
ఇదీ చదవండి: TS Police Jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులంటే..!