రెండురోజులుగా ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మెతో ప్రజలు, ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. రెండవ రోజు 11,359 వాహనాలు నడిపామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. వీటిలో 3,327 ఆర్టీసీ బస్సులు కాగా.. 2,032 అద్దె బస్సులు, 6 వేలకు పైగా ప్రైవేటు వాహనాలు నడిపామని తెలిపారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రచిస్తూ జేఏసీ ముందుకు వెళ్తుతోంది. ఇందులో భాగంగా అన్ని ఆర్టీసీ డిపోల ముందు బతుకమ్మలు ఆడి నిరసన తెలిపారు.
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు..
ఇవాళ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, సాయంత్రం ఇందిరాపార్కు వద్ద 16 మంది జేఏసీ నేతలు నిరాహార దీక్షకు దిగనున్నారు. ఇప్పటికే దీక్షకు సంబంధించి వివిధ రాజకీయ పక్షాల ముఖ్య నేతలను ప్రజా సంఘాల నేతలను కలిశారు. ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల మద్దతును కూడగట్టేందుకు జేఏసీ నేతలు ప్రణాళిబద్ధంగా ముందుకెళ్తున్నారు. తమ పోరాటం జీతభత్యాల కోసం కాదని... సంస్థ రక్షణ కోసమేనని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తునే.. మరోవైపు సమ్మెను ఉద్ధృతం చేస్తున్నారు.
భవిష్యత్ కార్యచరణ..
ఇవాళ్టి నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం పట్ల జేఏసీ నేతలు మండిపడుతున్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం నిరసనలు కూడా తెలపనీవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిరసన కార్యక్రమం చేపడతామని జేఏసీ స్పష్టం చేసింది. నిరాహార దీక్షకు ఎటువంటి అనుమతి లేదని, దీక్ష చేపడితే అరెస్టు చేస్తామని మధ్యమండలం డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మెకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించాయి. ఎవరు అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశాయి. దీక్షలో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ తెలిపింది.
ఇదీ చూడండి : స్వర్ణరథం, అశ్వవాహనం... శ్రీవారి కల్కి అవతారం దర్శనం