గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇంకా నోటిఫికేషన్లు జారీ చేయని రాష్ట్రాలు వెంటనే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడిన ధర్మాసనం సోమవారం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధిత రాష్ట్ర హైకోర్టులు సంప్రదింపులు జరపాలని కోరింది. సామాజిక, ఆర్థిక, తదితర కారణాల వల్ల పౌరులకు న్యాయం లభించకుండా పోరాదని... ఇంటి ముంగిటే వారికి న్యాయం అందించేలా చూసేందుకు గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలని భావించి పార్లమెంటు 2008లో చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా పలు రాష్ట్రాలు గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇచ్చినా కేరళ, రాజస్థాన్, మహారాష్ట్రల్లో మాత్రమే అవి ఏర్పడి పని చేస్తున్నాయని ధర్మాసనం గుర్తించింది. సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది అక్టోబర్ 18న ఇందు కోసం మార్గదర్శకాలు జారీ చేసినా గుజరాత్, హరియాణా, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇప్పటికీ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘ఈ రాష్ట్రాలు రూ.లక్ష డిపాజిట్ చేయడంతోపాటు వారంలోగా అఫిడవిట్లు సమర్పించాలి’ అని ఆదేశించింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు, సభ్యుల నియామకం పూర్తికాని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధిత హైకోర్టులు సంప్రదింపులు జరపాలని కోరింది. ఇప్పటి వరకూ నోటిఫికేషన్లు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వారాల్లోగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు ఆ ప్రతులను తమ అఫిడవిట్లతో జతచేయాలని కోరింది.
ఇదీ చదవండి : ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..!