ఏపీఎస్‌ఆర్టీసీ రాబడిలో ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వానికి 25 శాతం ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై నియమించిన ఉన్నతాధికారుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లో 2020 జనవరిలో విలీనమయ్యారు. అప్పటి నుంచి వీరికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. దీంతో ఆర్టీసీపై జీతాల భారం తగ్గడంతో.. రాబడిలో కొంత ఇవ్వాలని కోరుతోంది.
2020 మార్చి నుంచి గతేడాది చివరి వరకు కొవిడ్ ప్రభావం ఉండటంతో.. ఆర్టీసీకి రాబడి తగ్గిపోయింది. అయినప్పటికీ జీతాల భారం లేకపోవడంతో ఖర్చులు పోనూ వివిధ బకాయిలు దాదాపు రూ.1,400 కోట్లు చెల్లించారు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు రావడం, ఆర్టీసీ రాబడి, ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుండటంతో.. ప్రభుత్వం వాటా అడుగుతోంది. ఇందులో భాగంగా రవాణా, ఆర్టీసీ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతోపాటు కొందరు నిపుణులతో కొన్నాళ్ల కిందట ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ అధ్యయనం చేసి.. ఆర్టీసీ రాబడి నుంచి ప్రభుత్వానికి 25 శాతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని తెలిసింది. దీని అమలుకు త్వరలో ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి టికెట్ల రూపంలో రోజువారీ రాబడి సగటున రూ.15.21 కోట్లు ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం రూ.12.5 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు వస్తోంది. తాజాగా పెంచిన డీజిల్ సెస్‌తో నిత్యం రూ.2 కోట్ల వరకు అదనంగా రానుంది. ఇలా మొత్తంగా రోజువారీ రెవెన్యూ రూ.15 కోట్లకు చేరుతుంది. ఇందులో 25 శాతం అంటే రూ.3.5 కోట్ల నుంచి రూ.3.75 కోట్ల వరకు ఆర్టీసీ నిత్యం ప్రభుత్వ ఖజానాకు ఇచ్చే వీలుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: APSRTC CHARGES HIKE :ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు