మాన్సాస్ ట్రస్ట్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 3న జారీచేసిన జీవో 75ను రద్దుచేయాలని కోరుతూ ఆ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి , న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను ఈవో పాటించడం లేదన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా సంచైత గజపతిరాజు నియామకం, ట్రస్ట్ వ్యవస్థాపక కటుంబ సభ్యుల నియామకం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఆ జీవోలనే రద్దు చేసినప్పుడు .. పాలకమండలి ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం అప్పట్లో జారీచేసిన జీవో 75 కి విలువ ఉండదన్నారు. పాలక మండలికి మనుగడ సైతం ఉండదని స్పష్టం చేశారు. తమ పిటిషనర్ ఆదేశాల్ని పాటించేలా ఈవోను ఆదేశించాలని కోరారు.
దేవాదాయ శాఖ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ .. అదనపు అడ్వొకేట్ జనరల్ ఈ వ్యాజ్యంలో వాదనలు వినిపిస్తారన్నారు. విచారణను నేటికి వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. గతంలో జారీచేసిన పాలకవర్గ జీవోతో పాటు , పాలకవర్గం సమావేశం ఏర్పాటు నిమిత్తం మాన్సాస్ ట్రస్ట్ కార్యనిర్వహణాధికారి ఈ ఏడాది జూన్ 9న జారీచేసిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరుతూ మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పి.అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇదీ చదవండి: