పట్టణాలు, నగరాల్లోని ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు, అపార్టుమెంట్ల భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల డిమాండ్లను అనుసరించి కనీసం 5 నుంచి 50 శాతంపైగా పెరిగే అవకాశాలున్నాయి. ధరలు ఎంతవరకు పెంచాలనే అంశంపై ఇంకా మార్గదర్శకాలు వెలువడలేదు. ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని డిమాండ్‌ను అనుసరించి సవరిస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వకపోతే స్థానిక సబ్‌రిజిస్ట్రార్లు ప్రతిపాదించిన ధరలే అమల్లోకి రావచ్చు.
భూముల మార్కెట్ విలువను సవరించేందుకు అప్పటివరకు వచ్చిన రెవెన్యూ, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, ఆయా ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా భూముల మార్కెట్ విలువ పెంపు ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయలు సేకరించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకటో తేదీ నుంచే మార్కెట్ విలువ పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో ప్రశ్నార్థకంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల స్థిరాస్తి రంగం దెబ్బతింది. ఏప్రిల్, మే నెలల్లో రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. అయినా మార్కెట్ విలువ పెంపు దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆర్‌సీసీ భవనాలు, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాల విలువలనుప్రభుత్వం ఇప్పటికే సవరించింది. మైనర్ గ్రామ పంచాయతీల్లో నిర్మాణాల ధరలను అడుగుకు 20 నుంచి 30 రూపాయల వరకు పెంచారు. చవిటి మిద్దెలకు చదరపు అడుగుకు 360 నుంచి 370 రూపాయలు చేశారు. నిర్మాణాల మార్కెట్ విలువ చదరపు అడుగుకు ధరలు మారనున్నాయి. ప్రస్తుతం ఆర్‌సీసీ శ్లాబు 1100 రూపాయలు ఉండగా ఇకపై 1140 రూపాయలు కానుంది. 1190 రూపాయలుగా ఉన్న అపార్టుమెంట్ నిర్మాణ ధర చదరవు అడుగుకు 1240 రూపాయలకు పెరగనుంది. ప్రస్తుతం 790 రూపాయలుగా ఉన్న సెల్లార్ నిర్మాణ ధర ఇకపై 820 రూపాయలు కానుంది. జింక్ షీట్స్, ఆర్‌సీసీ కప్పు ప్రస్తుతం 600 ఉండగా ఇకపై 620 కానుంది.
ఇదీ చదవండీ... రేషన్ బియ్యం కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం