సంచలం సృష్టించిన ఫార్మసీ యువతి కిడ్నాప్,అత్యాచారం కేసు ఎన్నో నాటకీయ మలుపుల అనంతరం తప్పుడు కేసుగా తేలింది. ఇంటి నుంచి వెళ్లిపోవడానికే యువతి కిడ్నాప్ నాటకమాడినట్లు వెల్లడించారు. యువతిపై అత్యాచారం జరగలేదని... యువతి చెప్పిన విధంగా ఘటన జరిగినట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని యువతి నిర్ణయం తీసుకుందని... తల్లి పోలీసులకు చెప్పడంతో... భయపడి అత్యాచారం నాటకం ఆడినట్లు తెలిపారు.
ఇలా డ్రామా ఆడింది...
కేసులో మొదట ఈ నెల 10న సాయంత్రం ఆరున్నరకు పోలీసులకు ఫోన్ వచ్చింది. తన కుమార్తెను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేశారని మహిళ కేసు నమోదుచేసింది. యువతికి ఫోన్ చేసిన పోలీసులు...ఆమె పంపిన లైవ్ లొకేషన్ ఆధారంగా ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ తీవ్ర స్థితిలో పడిఉన్న యువతిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులు విచారించగా.... ఆటో డ్రైవర్ అపహరించి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.
సరైన ఆధారాలు దొరకకపోవడంతో...
యువతి మాటల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదు. సదరు ఆటోడ్రైవర్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఘటనా స్థలంలో లేకపోవడంతో.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. యువతి చెప్పిన డ్రైవర్ ఘటన జరిగిన సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.
100కు పైగా సీసీ కెమెరా దృశ్యాల పరిశీలన
ఆ తర్వాత యువతి మాటలు అబద్ధాలని అనుమానించిన పోలీసులు... 100కు పైగా సీసీ కెమెరా దృశ్యాలు పూర్తిగా పరిశీలించారు. విద్యార్థిని యంనంపేటలో ఆటో దిగి తిరిగినట్లు గుర్తించారు. విద్యార్థిని చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేల్చారు. సదరు ఆటోడ్రైవర్‌తో గతంలో డబ్బు విషయంలో గొడవ జరిగిన కారణంగానే అతని పేరు చెప్పినట్లు తేల్చారు.
ఆటో డ్రైవర్లకు పోలీసుల క్షమాపణ
కేసు విషయంలో ఎంతో మంది ఆటోడ్రైవర్లను విచారించామని తెలిపిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్...వారికి కలిగిన అసౌకర్యానికి చింతించారు. ఆటోడ్రైవర్లకు పోలీసుల తరఫున క్షమాపణ చెప్పారు. విచారణకు సహకరించినందుకు ధన్యావాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: