తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండావాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల క్రితం ఒడిశా వెళ్లాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
5 రోజుల క్రితం ఆమె అత్త కరోనా బారినపడింది. హోం క్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. అయితే కోడలు తనతో భౌతిక దూరం పాటించడాన్ని అత్త జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కోడలిపై ద్వేషం పెంచుకుంది. తనను దూరంగా పెడుతోన్న కోడలికీ వైరస్ అంటించాలని నిశ్చయించుకుంది.
పథకం ప్రకారం తరచూ కోడలిని ఆలింగనం చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమె పిల్లలనూ బలవంతంగా దగ్గరకు తీసుకుంది. ఫలితంగా కోడలికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే అదనుగా భార్యాభర్తలిద్దరూ కలిసి కోడలిని ఇంటి నుంచి గెంటేశారు. చిన్న పిల్లలున్నారనే కనికరం చూపకుండా బయటకు నెట్టేశారు.
విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి ఆమెను చేరదీసింది. తన ఇంటికి తీసుకొచ్చి హోం క్వారంటైన్‌లో ఉంచింది. తనకు కరోనా సోకడానికి అత్తే కారణం అంటూ బాధితురాలు వాపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోడలి పట్ల దారుణంగా ప్రవర్తించిన అత్తమామల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితురాలి బంధువులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న మండల వైద్యాధికారి, ఎంపీడీవో బాధితురాలిని పరామర్శించి.. నిత్యావసర సరుకులు అందించి ధైర్యంగా ఉండాలని సూచించారు.
రాష్టంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు