‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద మొదటి విడతలోని 15.10 లక్షల నిర్మాణాల్లో 1.29 లక్షల గృహాల విషయంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అనర్హులు, చనిపోయినవారు, ఇంటి నిర్మాణానికి సమ్మతి తెలపనివారివి, వలస వెళ్లినవారివి, కోర్టు కేసులున్న ఇళ్లను మొదటి విడతలో మినహాయించింది. వీటి స్థానంలో సొంత స్థలాలున్న వారికి, రెండో విడతలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపిన వారికి అవకాశం కల్పించింది. మొదటి విడతలోని 25వేల మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది.
లబ్ధిదారైన మహిళ లేదా ఆమె భర్త పేరు మీద ఇది వరకే గృహ నిర్మాణశాఖ పథకాల్లో ఇల్లు మంజూరైతే వారికి కేటాయించిన ఇంటిని రద్దు చేసింది. మొదటి విడత కింద చేపట్టిన మొత్తం గృహాల్లో 70వేల వరకు కోర్టు కేసులున్నవి ఉన్నాయి. ఇవి ఎక్కువగా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వానికి అనుకూలంగా పరిష్కారం వచ్చే అవకాశం ఉన్న 50వేల ఇళ్లను అలానే ఉంచి.. అవకాశం లేని 20వేల గృహాలను రెండో విడత కిందకు మార్చింది.
బృందాలుగా విభజించి బాధ్యతలు అప్పగింత..
ప్రభుత్వమే ఇళ్లు కట్టించేలా ఆప్షన్ ఎంచుకున్న 3.25 లక్షల మంది లబ్ధిదారులను గ్రూపులుగా చేసి నిర్మాణాలు చేపట్టారు. 20-25 మందిని ఒక్కో గ్రూపుగా చేశారు. ఇప్పటికే 70వేల మందిని బృందాలుగా విభజించి స్థానిక మేస్త్రీలకు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. వీరికి చెల్లించే రాయితీ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు ఈ ఇళ్లను ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి:
CM Review: కర్ఫ్యూలో సడలింపులు.. వివాహానికి 150 మందికే అనుమతి..!