అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(amrda) పరిధిలో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై టెండర్ కమిటీలను పునర్నియమిస్తూ.. పురపాలక శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సంస్కరణల్లో భాగంగా ఈపీసీ ప్రాతిపదికన రూ. పదికోట్లకు మించి చేపట్టే ప్రాజెక్టుల అమలుకు ఈ కమిటీలు పునర్నియమించినట్లు ఆమె తెలిపారు.
సాంకేతికంగా, ఆర్థికంగా వివిధ ప్రమాణాలను అనుసరించి బిడ్లను అంచనా వేయటంతో పాటు కాంట్రాక్టు గడువును పొడిగించటం వంటి అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి. ఏఎంఆర్డీఏ(amrda) అదనపు కమిషనర్.. ఛైర్మన్గా ప్రాథమిక అంశాలు, అంచనా విలువల నిర్ధరణ కోసం ఓ కమిటీ, పురపాలక శాఖ కార్యదర్శి నేతృత్వంలో టెండరు బిడ్లలోని సాంకేతిక అంశాల పర్యవేక్షణకు మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఏఎంఆర్డీఏ కమిషనర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఏఎంఆర్డీఏ చీఫ్ ఇంజనీర్లు కమిటీల్లో సభ్యులుగా వ్యవహరించనున్నారు.