ఫిలిప్పైన్స్‌లోని మనీలా విమానాశ్రయంలో సుమారు 90 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. తాము మనీలాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా సెలవులు ప్రకటించిన అక్కడి కళాశాలల యాజమాన్యం గురువారం సాయంత్రంలోపు ఖాళీచేయాలని లేనిపక్షంలో నిర్భంధిస్తామని విద్యార్థులకు హెచ్చరికలు జారీచేసింది. అంతే కాక అనుమతి లేకుండా వీధుల్లో తిరగొద్దని హెచ్చరించింది.
వీరంతా కౌలాలంపూర్ మీదుగా భారత్‌కు వచ్చేందుకు ఎయిర్ ఏషియా ఇండియా విమాన సర్వీసులో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఆయా దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమాన సర్వీసులన్నీ మంగళవారం నుంచే రద్దు కావటంతో తెలుగు విద్యార్థులంతా మనీలా విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం... తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మరికొన్ని గంటల వ్యవధిలో మనీలా విమానాశ్రయాన్ని అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్ చేయనుంది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : రాష్ట్రంలో రేపట్నుంచి విద్యాసంస్థలకు సెలవులు