సివిల్స్ - 2019 ఫలితాల్లో రాష్ట్ర అభ్యర్థులు ప్రతిభ కనబరిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50 మంది ఎంపికయ్యారు. అయితే ఏటా మొదటి 10 లేదా 20 ర్యాంకుల్లోపు తెలుగు అభ్యర్థులు నిలుస్తుండగా ఈసారి వారికి చోటు దక్కలేదు. వంద లోపు నలుగురు.. 200 లోపు మొత్తం 9 మంది అభ్యర్థులు మాత్రమే ర్యాంకులు సాధించారు.
ప్రణాళికతో సాధించారు
గుంటూరు యువకుడు మల్లవరపు సూర్యతేజకు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు లభించింది. రాష్ట్రంలో టాపర్‌గా నిలిచిన ఆయన... 2018లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాలుగు ప్రయత్నాల్లో ఓటమి సాధించినా... ప్రణాళికా బద్ధంగా చదివి ఐదో ప్రయత్నంలో విజయం సాధించానని చెప్పారు. గంటూరుకు చెందిన మోహన్ కృష్ణ 283 ర్యాంకు సాధించారు. ముంబయిలో ఎంటెక్ పూర్తి చేసిన మోహన్ కృష్ణ... అమెజాన్ సహా మరికొన్ని బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం వచ్చినా.. సివిల్స్ సాధించాలనే పట్టుదలతో వాటిని వదులుకున్నారు. మూడు ప్రయాత్నాల్లో విఫలమైనా... నాలుగో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నానని తెలిపారు.
సాఫ్ట్‌వేర్ వదిలి.. సివిల్స్ వైపు
విశాఖకు చెందిన ధీరజ్... ఇంట్లోనే చదువుకుంటూ సివిల్స్ సాధించారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం వదిలి... సివిల్స్ లక్ష్యం ఏర్పరుచుకున్న ధీరజ్... రెండో ప్రయత్నంలోనే విజయం సాధించారు.
కొవిడ్ ప్రత్యేక అధికారికి 250వ ర్యాంకు
అనంతపురం జిల్లా హిందూపురం కొవిడ్-19 ప్రత్యేక అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న చైతన్యకుమార్... 250వ ర్యాంకు దక్కించుకున్నారు. బిట్స్‌పిలానీలో ఇంజనీరింగ్ చేసిన ఆయన.. సివిల్స్ పరీక్షల్లో నాలుగుసార్లు విఫలమైనా మొక్కవోని దీక్షతో ఐదోసారి ర్యాంకు చేజిక్కించుకున్నారు. ఎటువంటి శిక్షణ తీసుకోకుండా... ఒక్కసారి మాత్రమే మౌఖిక పరీక్షకు సూచనలు తీసుకుని లక్ష్యం సాధించాన్నారు. హిందూపురంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించి... ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేశారు.
రైతుబిడ్డకు 117వ ర్యాంకు
కడప జిల్లా వేంపల్లెకి చెందిన రుషికేశ్ రెడ్డి... 95వ ర్యాంకు సాధించారు. 2018లో 374వ ర్యాంకు సాధించిన రుషికేష్ రెడ్డి.. లఖ్‌నవూలోని ఐఆర్టీసీలో శిక్షణ తీసుకుని మెరుగైన ర్యాంకు కైవసం చేసుకున్నారు. పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన రైతుబిడ్డ రాహుల్ కుమార్ రెడ్డికి 117వ ర్యాంకు దక్కించుకోగా... మైదుకూరు మండలం చిన్నయ్య గారిపల్లెకు చెందిన శివగోపాల్ 263వ ర్యాంకు సాధించారు.
ఐపీఎస్ సాధించినా.. ఐఏఎస్ లక్ష్యంతో
కర్నూలు జిల్లాకు చెందిన కులదీప్ 135వ ర్యాంకు సాధించారు. గతేడాది ఐపీఎస్‌కు ఎంపికైన ఆయన.. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. ఆయన తండ్రి విశ్వేశ్వరయ్య కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. ఆదోనికి చెందిన సమీర్ రాజా 603వ ర్యాంకు సాధించారు. పదోతరగతిలో టౌన్ టాపర్‌గా నిలిచిన తమ కుమారుడు.. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేశాక పూర్తిగా ఐఏఎస్ పైనే దృష్టిపెట్టాడని తండ్రి నరసింహులు తెలిపారు. సాఫ్ట్‌వేర్ కొలువులూ వదులుకుని సివిల్స్ సాధించటం గర్వంగా ఉందని తల్లి ఉష తెలిపారు.
ఇదీ చూడండి..
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్ కో