పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిబంధనావళిపై ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు మంగళవారం సమావేశమై కసరత్తు చేశారు. నిబంధనలను పేర్కొంటూ ప్రభుత్వం జీవో ఇస్తేనే ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు విద్యార్థులకు మార్కుల మెమో జారీ చేయాల్సి ఉంటుంది. సీసీఈ విధానంలో భాగంగా అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, గ్రేడ్ల విధానం, ప్రైవేట్ విద్యార్థుల(గతంలో తప్పినవారు)కు వారి చదివిన సంవత్సరంలో పొందిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ) మార్కుల ప్రకారం గ్రేడింగ్ తదితర అంశాలపై పరీక్షల విభాగం అధికారులు ముసాయిదా రూపొందించినట్లు సమాచారం. ఈవిషయమై మంగళవారం వీరు అడ్వొకేట్ జనరల్‌ను కలిసినట్లు తెలిసింది.
ముసాయిదా విద్యాశాఖ మంత్రి సబిత ఆమోదం పొందాక.. జీఓ జారీ అవుతుంది. వెంటనే గతంలోనే అప్‌లోడ్ చేసిన అంతర్గత మార్కులను 100కి లెక్కించి.. గ్రేడ్లు కేటాయించి విద్యార్థులకు మార్కుల మెమోలను వెబ్‌సైట్లో ఉంచుతారు. అందుకు 10 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రధానోపాధ్యాయులు అంతర్గత మార్కులను ఎస్‌ఎస్‌సీ బోర్డు పోర్టల్‌కు అప్‌లోడ్ చేసేముందు ఏ సబ్జెక్టులో 20కి ఎన్ని వచ్చాయో చూపి వారి సంతకాలు తీసుకుంటారు. మిగిలిన 80 మార్కులకు పరీక్షలు రాయాల్సి ఉన్నందున అంతర్గత మార్కులు చాలామంది గుర్తు పెట్టుకోరు. ఈసారి పరిస్థితి మారడంతో జీపీఏ ఎంతవస్తుందో విద్యార్థులు హెడ్మాస్టర్లకు ఫోన్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ