మొన్న నాగేశ్వరరావు, నిన్న విజయ్.. ఇప్పుడు భవానీసేన్... ఇలా రోజుకొకటిగా బయటపడుతున్న ఉదంతాలు పోలీసుశాఖ పరువును బజారుకీడుస్తున్నాయి. ఈ మూడు కేసులూ వివాహేతర సంబంధాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఒకపక్క తెలంగాణలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘షి’టీమ్స్, భరోసా కేంద్రాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. పోకిరీలను అరికట్టడంలో ‘షి’ టీమ్స్ సఫలం అవుతున్నాయి. కానీ పోలీసులే వేధింపులకు పాల్పడుతుండటం, వివాహేతర సంబంధాలకు పాల్పడటం అధికారులకు మింగుడు పడటంలేదు.
వెల్లువెత్తుతున్న ఆరోపణలు: ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తి వ్యాపారాలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు పెరుగుతుండటంతో వాటి ద్వారా లబ్ధిపొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా భూ లావాదేవీలకు సంబంధించి ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఏదో ఓ అవసరం మీద స్టేషన్‌కు వచ్చే మహిళలను ఆకట్టుకునో, బెదిరించో లోబరుచుకుంటున్న కేసులూ పెరుగుతున్నాయి. ప్రైవేటు వివాదాల్లో తలదూర్చుతున్న ఉదంతాలకూ లెక్కలేదు. పోలీసులపై వస్తున్న ఫిర్యాదులలో తీవ్రతను బట్టి అధికారులు విచారణ జరుపుతుంటారు. చాలావరకు శాఖాపరమైన చర్యలతో సరిపెడుతున్నారు. అభియోగాలు తీవ్రంగా ఉంటే మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్.సి.ఆర్.బి) గణాంకాల ప్రకారం 2020లో రాష్ట్రంలో పోలీసులపై అన్ని రకాల నేరాలకు సంబంధించి 92 కేసులు నమోదు కాగా 45 మంది అరెస్టయ్యారు. అయితే రానురానూ ఇలాంటి ఫిర్యాదులు, వాటి తీవ్రత పెరుగుతుండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
కన్నేసి ఉంచినా..: క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులపై స్పెషల్ బ్రాంచి (ఎస్బీ), నిఘా విభాగాలు ఎప్పుడూ కన్నేసి ఉంచుతాయి. సిబ్బంది పనితీరు, ప్రవర్తనను గమనిస్తూ అధికారులకు నివేదికలు అందిస్తుంటాయి. ఒకప్పుడు ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడం, బాగా పనిచేసిన వారికి మంచి పోస్టింగులు ఇవ్వడం చేసేవారు. కానీ ఇప్పుడు పోలీసుశాఖలో రాజకీయ జోక్యం పెరుగుతుండటంతో ఎస్బీ నివేదికలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. దాంతో సిబ్బందిలో లెక్కలేనితనం మొదలైందని, తప్పు చేసినా పలుకుబడితో తప్పించుకోవచ్చనే అభిప్రాయం కొంతమందిలో నెలకొందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులపై సగటున రోజుకు ఒక్కటయినా ఫిర్యాదు వస్తోందని, ఏటా 365 కన్నా ఎక్కువే ఆరోపణలు అందుతున్నాయని ఆయన తెలిపారు. నిజానికి ఏ చిన్న ఆరోపణ వచ్చినా పోలీసుశాఖలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, మిగతా ఏ ప్రభుత్వ శాఖలోనూ ఇలా ఉండదన్నారు. ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇదీ ఒక కారణమని ఆయన వెల్లడించారు.
ఇవీ చూడండి