తెలంగాణ రాష్ట్రానికి 12 జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు దక్కాయి. 2021 సంవత్సరానికి గాను దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. మెదక్ జిల్లా పరిషత్‌కు, జగిత్యాల జిల్లా కోరుట్ల, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్‌లకు సాధారణ విభాగంలో అవార్డులు లభించాయి. గ్రామపంచాయతీల్లో మార్జినలైజ్‌డ్ సెక్షన్ ఇంప్రూవ్మెంట్ విభాగంలో కరీంనగర్ జిల్లా పర్లపల్లికి అవార్డు దక్కింది.
సహజ వనరుల నిర్వహణా విభాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్‌నగర్‌కు, సాధారణ విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా చక్రాపూర్ గ్రామపంచాయతీకి అవార్డులు వచ్చాయి. పారిశుద్ధ్య విభాగంలో సిద్దిపేట జిల్లా మిట్టపల్లె, మల్యాల, అదిలాబాద్ జిల్లా రుయ్యడి పంచాయతీలకు జాతీయ అవార్డులు లభించాయి. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామపంచాయతీకి నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారం దక్కింది. ఇదే పంచాయతీకి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు కూడా లభించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా మోహినీకుంటకు చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీ అవార్డు లభించింది. అవార్డులు రావడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందు చూపు, చొరవ, మార్గదర్శనం వల్లే అవార్డులు దక్కాయన్నారు.
ఇదీ చదవండి: ఇవాళ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్