తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మంత్రివర్గం ఇప్పటికే తీర్మానం చేసింది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. పిటిషన్ను న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చడం వల్ల సర్కార్కు మార్గం సుగమమైంది.
కసరత్తు ప్రారంభం..
5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకోసం గతంలో జాతీయం చేసిన మార్గాలను డీనోటిఫై చేయాల్సి ఉంటుంది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా మార్గాల ప్రైవేటీకరణ కోసం రవాణా శాఖ విధివిధానాలు తయారు చేయాలి. ఆ తర్వాత మార్గాలను డీనోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దానిపై అభ్యంతరాలు, సలహాలకు నెల రోజుల పాటు గడువుంటుంది. వాటిని పరిష్కరించాక ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తుది నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తర్వాతే ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత ప్రక్రియ ప్రారంభిస్తారు.
కార్మికుల పరిస్థితి..?
ఏకంగా 5,100 ప్రైవేట్ బస్సులు వస్తే ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్నది ఇపుడు ప్రధాన సమస్య. సంస్థలో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గాక ఇప్పుడున్న ఉద్యోగుల సేవలు ఆర్టీసీకి అవసరం ఉండబోవు. సంస్థలో ప్రస్తుతం 49 వేల మంది ఉద్యోగులు ఉండగా... ఏటా సుమారు నాలుగు వేల మంది వరకు పదవీ విరమణ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆర్టీసీలో ఎలాంటి కొత్త నియామకాలు లేవు. ఇపుడున్న సిబ్బంది సంఖ్య సగానికి తగ్గాలంటే కనీసం ఐదారేళ్లు పడుతుంది. అప్పటి వరకు వారందరికీ జీతభత్యాలు ఇవ్వడం సంస్థకు ఇబ్బందికరమనే అంటున్నారు. ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
స్వచ్ఛంద పదవీ విరమణ..
స్వచ్ఛంద విరమణ అమలు చేస్తే పడే ఆర్థికభారం సహా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అసలే ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయి ఉంటే వీఆర్ఎస్ పేరిట పడే అదనపు ఆర్థికభారాన్ని ఎలా భరిస్తారన్నది కూడా సమస్యే. 50 ఏళ్లు పైబడిన వారికి స్వచ్ఛంద విరమణ అమలు చేస్తే ఎలా ఉంటుందన్న విషయమై అధికారుల స్థాయిలో తర్జనభర్జనలు సాగినట్లు సమాచారం.
నేడో, రేపో సీఎం సమీక్ష...
షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని కార్మికసంఘాల ఐకాస ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అన్ని అంశాలను గమనిస్తోన్నకేసీఆర్ సర్కార్... వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నేడో, రేపో ఆర్టీసీ విషయమై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మార్గాల ప్రైవేటీకరణ, ఆర్టీసీ పరిస్థితి, కార్మికుల విషయమై సీఎం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చూడండి: