Telangana Government ON Dindi Upliftment Scheme: పర్యావరణ అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిండి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఎన్జీటీ జ్యుడీషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, సాంకేతిక సభ్యులు డాక్టర్ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏపీ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, న్యాయవాది దొంతిరెడ్డి మాధురిరెడ్డి వాదనలు వినిపిస్తూ పర్యావరణ అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడుతోందన్నారు. పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పనులు కొనసాగిస్తోందన్నారు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశాక పీఆర్‌ఎల్‌ఐఎస్ పనులను ఆపాలంటూ ఇంజినీర్లకు లేఖ రాసినట్లు చెప్పారు. దాన్నుంచే డిండికి నీటి సరఫరా అవుతున్నందున దాన్నీ ఆపేశామన్నారు. జనవరి 6వ తేదీన పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు సంబంధించిన పిటిషన్ విచారణకు రానుందని, అదే తేదీకి డిండిపై పిటిషన్‌ను వాయిదా వేయాలని కోరారు. ధర్మాసనం అనుమతిస్తూ డిండి పనులను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఇచ్చిన హామీని రికార్డు చేస్తూ విచారణను జనవరి 6కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: కరోనా చికిత్సకు తొలి ట్యాబ్లెట్- వైరస్‌పై గెలుపు ఇక సులువయ్యేనా?