తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ అమలవుతుందన్న ఆయన... ప్రజలందరూ ఆలోపే ఇళ్లకి చేరుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఉద్ఘాటించారు. బుధవారం నుంచి మద్యం అమ్మకాలకు అనుమతిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సరాసరిగా 16 శాతం ధరలు పెంచుతామని స్పష్టం చేశారు.
కనిపించని శత్రువు
‘‘కరోనాను నమ్మడానికి వీల్లేదు.. కనిపించని శత్రువు. ప్రజలు తమకు తామే స్వీయనియంత్రణ పాటించాలి. ఎవరో బలవంతపెడితే పాటించాలనుకోవద్దు. తమని తామే రక్షించుకోవాలి. అమెరికాలో భారీగా మరణాలు సంభవించాయి. మనదేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. భౌతిక దూరం పాటించి కొంత విజయం సాధించాం. ఏకైక ఆయుధం లాక్‌డౌన్. కొంచెం జాగ్రత్తగా ముందుకెళితే రాష్ట్రం, సమాజం బాగుపడే అవకాశముంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నాం. ప్రజలంతా సహకరించాలి. ఇప్పటికే వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు పదేపదే తిరిగే అవసరం లేకుండా మూడు నెలలకు అవసరమైన మందులు ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించాం. వారికోసం సుమారు కోటి మాస్క్‌లు ఉచితంగా అందజేస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు.